ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇటలీలో తెలుగు విద్యార్థుల తిప్పలు.. జ్వరం వచ్చినా వైద్యం కటకట - latest news on corona in italy

ఇటలీలో తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరోనా నేపథ్యంలో అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సాధారణ జ్వరంతో ఆసుపత్రికి వెళ్లినా వైద్యం అందని పరిస్థితి నెలకొంది.

telugu students difficulties  in italy
ఇటలీలో తెలుగు విద్యార్థుల తిప్పలు

By

Published : Apr 5, 2020, 6:39 AM IST

కరోనా వ్యాప్తి ఇటలీలోని తెలుగు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణ జ్వరంతో ఆసుపత్రికి వెళ్లినా బారెడు వరసలు తప్పడంలేదు. నిత్యావసరాలు, మందుల దుకాణాలు మినహా అన్నీ మూసేశారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పించాయి. విద్యార్థుల తాత్కాలిక ఉద్యోగాలు పోయాయి. ఎలాంటి కారణం లేకుండా బయట తిరిగితే 3వేల యూరోల జరిమానా విధిస్తున్నారు. విశ్వవిద్యాలయాలన్నీ మే నెల వరకు సెలవులు ప్రకటించాయి. ఆన్‌లైన్‌ తరగతులే నిర్వహిస్తున్నాయి. కరోనా బాధితులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేకపోవడంతో పగలు, రాత్రి తేడా తెలియని పరిస్థితి నెలకొంది.

కొందరు విద్యార్థులకు ఇంటి నుంచే డబ్బులు

ఒక్క సపిన్‌జా వర్సిటీలోనే 30మంది తెలుగు విద్యార్థులు ఇంజినీరింగ్‌ (గ్రాడ్యుయేషన్‌) చదువుతున్నారు. సెమిస్టర్‌ రుసుముల చెల్లింపు గడువును కొన్ని వర్సిటీలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు పొడిగించాయి. కొందరికి ఉపకార వేతనాలు వస్తుండగా, మరి కొందరు ఇంటి నుంచే డబ్బులు తెచ్చుకుంటున్నారు.

పోలీసుల అనుమతి ఉంటేనే..

లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థుల వీసా పునరుద్ధరణ గడువును మే 15వరకు పొడిగించారు. భారత్‌కు రావాలంటే భారత హైకమిషన్‌ కార్యాలయంలో తొలుత రక్త నమూనాలు ఇవ్వాలనే నిబంధనను విధించారు. ఇప్పుడు అక్కడికి వెళ్లే పరిస్థితే లేదు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి అవసరమవుతోంది.

మానసిక ఆందోళన తీవ్రం

కరోనా మరణాలు, వ్యాప్తి విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి. రియితిలో తెలుగు విద్యార్థులుండే అపార్టుమెంటుకు సమీపంలో ఇటీవల కొవిడ్‌ బారిన పడిన ఐదారుగురిని ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రోమ్‌లో ఉండే ఒక తెలుగు విద్యార్థికి ఇటీవల జ్వరం రావడంతో కరోనాగా భావించి భయపడ్డారు. వైద్యులు సాధారణ జ్వరంగా తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.

రెండు నెలలకు సరిపడా ఒక్కసారే..

రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు తెచ్చుకున్నా. నెల రోజులనుంచి ఒక్కసారి మాత్రమే పాలు, పెరుగు కోసం బయటకు వెళ్లా. మొదట 10 రోజులే సెలవులనుకొని ఇక్కడే ఉండిపోయా. ఆ తర్వాత పరిణామాలతో భారత్‌కు రాలేని పరిస్థితి ఏర్పడింది- అనుసుమన్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి, సపిన్‌జా వర్సిటీ, ఇటలీ

ఇంట్లో ఉంటే ఏమీ కాదనే ధైర్యంతో..

వారం, రెండు వారాలకోసారి రద్దీలేని సమయంలోనే సరకులకు వెళ్తున్నాం. చుట్టుపక్కల ఎవరికైనా కరోనా పాజిటివ్‌ తేలితే కొంచెం ఆందోళనకరంగా ఉంటోంది. ఇంటికే పరిమితమవుతున్నాం - నితిన్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థి, ఇటలీ.

ABOUT THE AUTHOR

...view details