Russia Ukraine War: ‘అనుకోని ఘటనలు జరిగే సమయంలో అప్రమత్తం చేసేందుకు మా యూనివర్సిటీ అధికారులు సైరన్ ఏర్పాటు చేశారు. అది మోగగానే వర్సిటీ ప్రాంగణంలోనే ఉన్న బంకర్లలోకి వెళ్లండి.. సురక్షితంగా ఉండే అవకాశముందని చెప్పారు. ప్రభుత్వం విమాన సేవలు కల్పిస్తే భారత్‌కు వచ్చేస్తాం. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు వందల మంది ఉక్రెయిన్‌లో ఉన్నారు’ .. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన వర్కల ఆశిష్‌కుమార్ (20) చెబుతున్న మాటలివి.
ఆ దేశంలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఆశిష్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధం తప్పదన్న సంకేతాలతో ముందు జాగ్రత్తగా బుధవారం వారం రోజులకు సరిపడా కూరగాయలు, కిరాణా సామగ్రిని కొనుగోలు చేసినట్లు ఆశిష్ వివరించారు.