ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇండియన్ ఎంబసీ నుంచి స్పందన లేదు.. చాలా భయంగా ఉంది: ఉక్రెయిన్​లోని తెలుగు విద్యార్థులు - ఉక్రెయిన్‌లో పరిస్థితిని వివరించిన తెలుగు విద్యార్థిని లక్ష్మిశ్రీలేఖ

telugu student on ukraine crisis: రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధ భయాలతో అక్కడి తెలుగువారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షణక్షణం తాము ప్రాణభయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి, తాగడానికి కూడా తమకు ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు.

telugu student on ukraine crisis
రాజధాని కీవ్‌కు ప్రయాణం చేయవద్దని చెప్పారు: లక్ష్మిశ్రీలేఖ

By

Published : Feb 24, 2022, 4:42 PM IST

Updated : Feb 24, 2022, 6:10 PM IST

RUSSIA UKRAINE WAR NEWS: అత్యవసరం అయితే తప్ప తమను బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారని ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థిని లక్ష్మీ శ్రీలేఖ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీ భారత్' ​తో ఆమె మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలిపారు. రాజధాని కీవ్‌ వైపు మాత్రం ప్రయాణాలు చేయొద్దని.. జాగ్రత్తగా ఉండాలని చెప్పారని ఆమె వివరించారు. 10 రోజులకు సరిపడా నిత్యావసరాలను ఇంట్లో ఉంచుకోవాలని అధికారులు సూచించారన్నారు.

"మా యూనివర్సిటీలో సుమారు 500 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఈనెల 25, 26 తేదీల్లో భారత్‌కు వచ్చే విమానాలు రద్దు అయ్యాయి. భారత రాయబార కార్యాలయ అధికారులు మాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థులందరినీ తరలిస్తామని చెప్పారు. బయటకు వెళ్లేటప్పుడు పాస్‌పోర్టు ఉంచుకోవాలని సూచించారు. తాత్కాలికంగా ఉక్రెయిన్‌ను వీడి రావాలని భారత ప్రభుత్వం చేసిన సూచన మేరకు చాలామంది స్వదేశానికి బయల్దేరుతున్నారు. మార్చి 10 వరకు ఉన్న టికెట్లన్నీ బుక్‌ అయిపోయాయి" అని లక్ష్మీ శ్రీలేఖ వివరించారు.

ఇండియన్ ఎంబసీ నుంచి సరైన స్పందన లేదు..

ఇండియన్ ఎంబసీ నుంచి సరైన స్పందన లేదని విశాఖకు చెందిన మరో తెలుగు విద్యార్థిని శ్రీజ వెల్లడించారు. కీవ్ ప్రాంతానికి 500 కి.మీ. దూరంలో ఉన్నామని ఇక్కడ చాలా భయనక పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. తాము బుక్ చేసుకున్న చార్టర్ విమానాలను రద్దు చేసినట్లు శ్రీజ వెల్లడించారు.

ఇండియన్ ఎంబసీ నుంచి స్పందన లేదు

"కీవ్ ప్రాంతానికి 500 కి.మీ. దూరంలో ఉన్నాం. కావాల్సిన సామాన్లు కొనుక్కుని తెచ్చుకున్నాం. అత్యవసరమైతే మెట్రో అండర్‌గ్రౌండ్‌కు తీసుకెళ్తామన్నారు. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మమ్మల్ని తీసుకెళ్లాలి. కీవ్ విమానాశ్రయానికి వెళ్లినవారు తిరిగివస్తున్నారు. కీవ్‌ సమీప ప్రాంతాల్లో చాలా భయంగా ఉంది. మేం బుక్ చేసుకున్న చార్టర్డ్ విమానాలు రద్దు చేశారు. ఇండియన్ ఎంబసీ నుంచి సరైన స్పందన లేదు." -శ్రీజ, తెలుగు విద్యార్థిని

వీడియో కాల్​లో మాడ్లాడిన ఎంపీ రామ్మోహన్

ఉక్రెయిన్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు చిక్కుకున్నారు. వారితో ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు వీడియో కాల్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను విద్యార్థులు ఎంపీకి వివరించారు. భవిష్యత్తులో ఆహారానికి కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని విద్యార్థులు వాపోయారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం కేంద్ర మంత్రిత్వ శాఖతో మాట్లాడి వారిని స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

ఆందోళనలో తల్లిదండ్రులు..

ఉక్రెయిన్​​లో యుద్ధం ప్రారంభం కావడంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డల క్షేమ సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తన పిల్లలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సుమారు 2వేల మంది తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్​లో ఉన్నారు.

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని కడారి సుమాంజలి ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో చిక్కుకుందని ఆమె తండ్రి కడారి రాజయ్య తెలిపారు. ఉక్రెయిన్​లో గత ఏడేళ్లుగా ఆమె చదువుతున్నట్లు చెప్పారు. అయితే ఆ దేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో భారత్​కు వచ్చేందుకు సిద్ధమైందని రాజయ్య తెలిపారు. కీవ్​ నగరానికి చేరుకొనే సరికే.. యుద్ధం ప్రారంభమైందని.. దాంతో ఎయిర్​పోర్ట్​లోనే చిక్కుకున్నట్లు తమకు ఫోన్​ చేసి చెప్పిందని ఆమె తండ్రి చెప్పారు. తన కుమార్తెతో పాటు మరో 20 మంది భారతీయ విద్యార్థులు ఎయిర్​పోర్టులోనే చిక్కుకున్నట్లు చెప్పిందని రాజయ్య చెప్పారు. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నా.. తినేందుకు ఆహారం లేదందని రాజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆందోళనలో తల్లిదండ్రులు

'ఇండియాకు వచ్చేందుకు ఫ్లైట్​ టికెట్లు బుక్​ చేసుకుంది. ఎయిర్​పోర్టుకు వచ్చేసరికే పరిస్థితి ఆందోళకరంగా మారింది. దాంతో ఎయిర్​పోర్టులోనే చిక్కుకుపోయింది. మొత్తం 20 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నట్లు చెప్పింది. క్షేమంగానే ఉన్నా.. ఆహారం, నీళ్లు అందుబాటులో లేవని చెప్పింది.'

- కడారి రాజయ్య, సుమాంజలి తండ్రి

ఉక్రెయిన్​లో బోధన్​ విద్యార్థి..

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన నరేందర్​బాబు కుమారుడు వినయ్​ ఉక్రెయిన్​లో చదువుతున్నాడు. ఓజోరాన్ యూనివర్సిటీలో ఎంబీబీస్ తృతీయ సంవత్సరం చదువుతున్నట్లు ఆయన తండ్రి చెప్పారు. తమ కుమారుడు ఈ రోజు ఉదయం ఫోన్​ చేశాడని.. ప్రస్తుతం తమ కుమారుడు ఉంటున్న ప్రాంతంలో పరిస్థితి బాగానే ఉందని చెప్పినట్లు తెలిపారు. గంట గంటకు పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తన కుమారుడిని స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు.

'మా కుమారుడు వినయ్​ ఉక్రెయిన్​లో ఎంబీబీఎస్​ మూడో సంవత్సవం చదువుతున్నాడు. యుద్ధ భయాలతో ఫ్లైట్​ టికెట్లు బుక్​ చేసుకున్నారు. యుద్ధం ప్రారంభం కావడంతో ఫ్లైట్స్​ క్యాన్సిల్​ అయ్యాయి. ప్రస్తుతానికి ఇబ్బంది లేదని, సురక్షితంగానే ఉన్నామని చెప్పాడు.'

- నరేంద్రబాబు, వినయ్​ తండ్రి

ఎంపీ బండి సంజయ్​కు ఫోన్..

ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ ఎయిర్​పోర్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. భారత్​ వచ్చేందుకు విమానం టికెట్టు బుక్​ చేసుకున్న వారంతా ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. అయితే అంతలోనే యుద్ధం ప్రారంభం కావడంతో ఉక్రెయిన్​ తన గగన తలాన్ని మూసివేసింది. గగన తలాన్ని డేంజర్ ​జోన్​గా ప్రకటించింది. ఎయిర్​పోర్టు నుంచి బయటకు వెళ్లే దారులను మూసివేసింది. దీంతో విద్యార్థులంతా ఎయిర్​పోర్టులోనే ఉండిపోయారు. ఉక్రెయిన్‌లోని జాఫ్రోజియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్​ చదువుతున్నారు.

ఉక్రెయిన్​లోని తెలుగు విద్యార్థులు

భారత్​కు రాలేక.. తిరిగి యూనివర్సిటీకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నట్లు.. కరీంనగర్​కు చెందిన విద్యార్థులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు ఫోన్​ చేశారు. తమ సమస్యలను వివరించారు. విద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించిన ఎంపీ సంజయ్​.. వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. విద్యార్థులందరినీ స్వదేశానికి రప్పించాలని విన్నవించారు.

ఇదీ చదవండి:'ఇప్పటికే ఆలస్యమైంది.. ఎలాగైనా యుద్ధాన్ని ఆపండి'

Last Updated : Feb 24, 2022, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details