ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Srisailam Reservoir: శ్రీశైలం కనీసమట్టంపై రెండు రాష్ట్రాల పట్టు - శ్రీశైలం ప్రాజెక్టు కనీస మట్టంపై తెలుగు రాష్ట్రాల గొడవ

Srisailam Reservoir : శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకునే కనీస మట్టం స్థాయి(ఎండీడీఎల్‌)పై రెండు తెలుగు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. ఎండీడీఎల్ ట్రైబ్యునల్ అవార్డు మేరకే కొనసాగించాలని తెలంగాణ కోరుతుంటే.. 854 అడుగుల స్థాయి ఉండేలా చూడాలని ఏపీ ప్రతిపాదించింది. చెన్నై తాగునీటి సరఫరా కమిటీ సమావేశంలో ఈ చర్చ జరిగింది.

Srisailam Reservoir
శ్రీశైలం జలాశయం

By

Published : Jun 25, 2022, 9:40 AM IST

Srisailam Reservoir : శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకునే కనీస మట్టం స్థాయి (ఎండీడీఎల్‌) ట్రైబ్యునల్‌ అవార్డు మేరకే (834 అడుగులు) కొనసాగించాలని తెలంగాణ కోరింది. చెన్నై నగరానికి తాగునీటిని సరఫరా చేయాలంటే జలాశయంలో 854 అడుగుల మట్టం ఉండేలా తెలంగాణ చూడాలని ఏపీ ప్రతిపాదించగా తెలంగాణ తిరస్కరించింది. చెన్నై తాగునీటి సరఫరా కమిటీ సమావేశం ఆన్‌లైన్‌ వేదికగా కృష్ణాబోర్డు నేతృత్వంలో శుక్రవారం జరిగింది.

బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌, సభ్యకార్యదర్శి రాయ్‌పురే నేతృత్వం వహించారు. 2022-23 సంవత్సరానికి శ్రీశైలం నుంచి విడుదల చేయాల్సిన ప్రణాళికపై కమిటీ సభ్య రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన నీటిపారుదల శాఖల అధికారులు చర్చించారు. తెలంగాణ నుంచి అంతర్‌ రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ మోహన్‌రావు, ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు తదితరులు హాజరయ్యారు.

సెన్సర్ల ఏర్పాటుకు ఏపీ అభ్యంతరం..చెన్నైకి జూన్‌ నెల కోటా నీటిని ఇప్పటికే విడుదల చేసినట్లు ఏపీ తెలిపింది. పూండి జలాశయం వద్ద మరమ్మతుల నేపథ్యంలో వచ్చే రెండు నెలలు నీటిని విడుదల చేయొద్దని తమిళనాడు సూచించింది. కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తామని..కండలేరు జలాశయంలో ఆ నీటిని నిల్వ చేసుకునేలా తమిళనాడు చూసుకోవాలని తెలంగాణ పేర్కొంది. ఈ సందర్భంగా ఏపీ శ్రీశైలం ఎండీడీఎల్‌ స్థాయి 854 అడుగులు ఉండేలా తెలంగాణ చూస్తేనే చెన్నైకి నీటిని ఇవ్వడానికి వీలుంటుందని ప్రతిపాదించగా.. తెలంగాణ అభ్యంతరం తెలిపింది. చెన్నై తాగునీటి సరఫరాకు సంబంధించిన ఒప్పందాలలో ఎక్కడా ఆ విషయం ఖరారు చేయలేదని చెప్పింది. ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారమే నడుచుకోవాలని పేర్కొంది.

బనకచర్ల, వెలిగోడు వద్ద నీటి సామర్థ్యాన్ని లెక్కించే సెన్సర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రతిపాదించగా ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశం బోర్డు సమావేశంలో చర్చించాలని ఛైర్మన్‌ పేర్కొన్నారు. చెన్నై నగరానికి తాగునీటి సరఫరా నిరాటంకంగా సాగేందుకు కండలేరు నుంచి పూండి జలాశయం వరకు పైపులైను నిర్మాణం అవసరం ఉందని తమిళనాడు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పనకు ఏడాది సమయం పట్టే అవకాశముందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details