సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ - ఎస్‌డీజీ) సాధనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దూసుకుపోతున్నాయి. తమిళనాడుతో కలిసి తెలుగు రాష్ట్రాలు మూడో స్థానంలో నిలిచాయి. కేరళ ప్రథమ స్థానాన్ని, హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానాన్ని పొందాయి. ఎస్‌డీజీ భారత సూచికలు-2019 పేరుతో నీతి ఆయోగ్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడయింది. లక్ష్య సాధనలో కేరళకు 70 మార్కులు; హిమాచల్‌కు 69; ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు 67 మార్కుల వంతున వచ్చాయి. బిహార్, ఝార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లు అట్టడుగున నిలిచాయి. 2030 నాటికి సాధించాల్సిన ప్రగతి పేరుతో ఐక్యరాజ్యసమితి ఈ లక్ష్యాలను రూపొందించింది. గత అయిదేళ్లుగా భారత్ వీటి సాధనకు కృషి చేస్తూ ప్రతి ఏటా మదింపు జరుపుతోంది.
- దేశం మొత్తం వివరాలను పరిశీలించినప్పుడు లక్ష్యాల సాధనలో భారత్‌కు 60 మార్కులు వచ్చాయి. గత ఏడాది 57 మార్కులే రాగా, ఈ సారి 3 మార్కులు పెరగడం విశేషం.
- తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశ్రమలు, నవకల్పనల రంగాల్లో పరిస్థితులు మెరుగవడమే ర్యాంకు పెరుగుదలకు దోహదపడింది.
- పౌష్టికాహారం, స్త్రీ-పురుష సమానత్వం ఇంకా సమస్యలుగానే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంది.
- పేదరికం నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, సిక్కింల పనితీరు బాగుంది.
శుద్ధ జలంలో రాష్ట్రమే మేటి...
శుద్ధజలం, పారిశుద్ధ్యం అంశాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మేటిగా ఉంది. 100కుగానూ 96 పాయింట్లు సాధించింది.
- 97.40% ఇళ్లకు మెరుగైన విధానాల ద్వారా మంచినీరు అందుతోంది.
- ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం ఉంది.
- బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ (ఓడీఎఫ్) పథకం కింద ప్రతి జిల్లాలోనూ తనిఖీలు జరిగాయి.
- 99.8 శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయి.
- 95.14% పరిశ్రమలు సొంతంగా మురుగునీటి శుద్ధి సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాయి.