farmer debts: ఆంధ్రప్రదేశ్‌లో 93.2%, తెలంగాణలో 91.7% వ్యవసాయ కుటుంబాలు రుణ ఊబిలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. వ్యవసాయ కుటుంబాల రుణభారంపై నిర్వహించిన 70వ రౌండ్ సర్వే (2012-13) ప్రకారం అప్పుల్లో చిక్కుకున్న వ్యవసాయ కుటుంబాల సంఖ్య ఏపీలో 92.9% ఉండగా, 77వ రౌండ్ సర్వే (2018-19) నాటికి 93.2%కి చేరినట్లు చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణలో రుణభారం మోస్తున్న రైతు కుటుంబాల సంఖ్య 89.1% నుంచి 91.7%కి చేరినట్లు వెల్లడించారు.
జాతీయస్థాయిలో రుణ ఊబిలో ఉన్న రైతుకుటుంబాలు సగటున ఇదివరకు 51.9% ఉండగా, ఇప్పుడు అది 50.2%కి తగ్గిందని కేంద్రమంత్రి చెప్పారు. కేంద్రమంత్రి సమాధానం ప్రకారం తెలుగురాష్ట్రాల్లో మాత్రం రుణబాధితుల సంఖ్య పెరిగింది. అప్పుల ఊబిలో కూరుకున్న అత్యధిక వ్యవసాయ కుటుంబాల్లో ఏపీ మొదటి, తెలంగాణ రెండోస్థానంలో నిలిచాయి. తర్వాతి స్థానంలో కేరళ (69.9%), కర్ణాటక (67.7%), తమిళనాడు (65.1%) ఒడిశా (61.2%), మహారాష్ట్ర (54%), పశ్చిమబెంగాల్ (50.8%) ఉన్నాయి. మిగతా అన్నిరాష్ట్రాల్లోని రుణబాధిత కుటుంబాల సంఖ్య జాతీయసగటుకంటే తక్కువే ఉంది.
పీఎం కిసాన్ నిధులు రూ.1956 కోట్ల పంపిణీ