తెలుగు ప్రజలు, వారికి నాయకత్వం వహిస్తున్న పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా.. తెలుగు భాష, సంస్కృతి, ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆకాంక్షించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ తలమానికమన్నారు. ఆయనకు గౌరవం దక్కితే యావత్ తెలుగు జాతికి లభించినట్లేనని చెప్పారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలు ఏవైనా.. ఐక్యంగా మన భాషను, సంస్కృతిని కాపాడుకోకుంటే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా భాష, సంస్కృతి పరిరక్షణకు ఉద్యమించాలన్నారు. సామాజిక మాధ్యమాలు, ఇతర సాధనాల ద్వారా ఏడాదిపాటు ఊరూవాడా తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రచారం నిర్వహించాలని.. ఇదే ఎన్టీఆర్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అని జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. గురువారం తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు గౌరవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కమిటీ, నందనం అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పదవి కోసం పార్టీ పెట్టలేదు..
‘ఎన్టీఆర్ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. అంతే తప్ప ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో కావాలని పార్టీ పెట్టలేదు. ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభంజనంలోనూ ఎన్టీఆర్ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు సాధించినా తెదేపాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆయన రాజకీయ జీవితమిచ్చిన వారిలో ఎందరో జాతీయ, రాష్ట్రస్థాయిలో హోదాలు, పదవులు అనుభవించారు. ప్రతిపక్షానికి కేంద్రంలో గుర్తింపు తెచ్చి, దేశ రాజకీయాల్లో అవినీతిని ప్రక్షాళన చేసేందుకు పనిచేసిన వ్యక్తికి విపక్షాలు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు. సినీ రంగంలోనూ ఆయనకు అవార్డులు ఇవ్వడంలో చిన్నచూపు చూశారు. తెలుగు జాతి ఐక్యంగా ఉండి ఆ గొప్ప నాయకుడికి అండగా నిలిస్తే.. ఆయనకే కాదు యావత్ తెలుగు జాతికి గౌరవం లభించి ఉండేది’ అని జస్టిస్ ఎన్.వి.రమణ అభిప్రాయపడ్డారు. భాష, సంస్కృతి, ఆత్మగౌరవం విషయంలో తమిళుల పోరాటం నుంచి నేర్చుకోవాలని సూచించారు.