ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rastrapathi Awards : రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు గెలుచుకున్న తెలుగు అధికారులు..

Rashtapathi Awards : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సేవలందిస్తున్న పలువురు తెలుగు అధికారులు రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు గెలుచుకున్నారు. ఈ అవార్డు అందుకోనున్న వారిలో జాతీయ విపత్తుల స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌)లో కమాండెంట్‌గా పనిచేస్తున్న వీవీఎన్‌ ప్రసన్నకుమార్‌, సీబీఐలో అదనపు న్యాయసలహాదారు సుబ్రహ్మణ్యం దేవేంద్రన్‌ ఉన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన వీవీఎన్‌ ప్రసన్నకుమార్‌ 1997లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాలో సీఆర్‌పీఎఫ్‌లో చేరి మణిపుర్‌, అస్సాం, జమ్మూకశ్మీర్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ హోదాల్లో అంతర్గత భద్రతా విభాగాల్లో పనిచేశారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దిల్లీ కేంద్ర కార్యాలయంలో సేవలందిస్తున్నారు. ఇక్కడికి రావడానికి ముందు సీఆర్‌పీఎఫ్‌ 39వ బెటాలియన్‌లో కమాండెంట్‌గా విజయవాడలో పనిచేశారు.

Rastrapathi Awards
రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు గెలుచుకున్న తెలుగు అధికారులు..

By

Published : Jan 26, 2022, 7:41 AM IST

Updated : Jan 26, 2022, 9:32 AM IST

సీబీఐ న్యాయసలహాదారు దేవేంద్రన్‌

దిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో అదనపు న్యాయసలహాదారుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం దేవేంద్రన్‌కు రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం దక్కింది. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం ఎట్టేరి గ్రామానికి చెందిన ఈయన 28 ఏళ్లుగా సీబీఐలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. లోగడ చెన్నై, మదురై, కోయంబత్తూరు, పుదుచ్చేరి, కొచ్చిన్‌, విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లోని సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వాదనలు వినిపించారు. ఇండియన్‌ బ్యాంకు కుంభకోణంలో సీబీఐ తరఫున వాదనలు వినిపించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ 2007లో బంగారుపతకం ప్రదానం చేసింది. 2016లో సీబీఐ డైరెక్టర్‌ నుంచి ప్రొఫెషనల్‌ ఎక్స్‌లెన్స్‌, 2020లో కేంద్ర హోంశాఖనుంచి అతిఉత్కృష్ట్‌ సేవా పతకం అందుకున్నారు.

భావనా సక్సేనాకు విశిష్ట సేవా పురస్కారం

దిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న 1996 బ్యాచ్‌ ఏపీకేడర్‌ ఐపీఎస్‌ అధికారి భావనా సక్సేనాకు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారం లభించింది. 2012లో రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం పొందిన ఆమె ఇప్పుడు విశిష్టసేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్‌ప్రకాశ్‌ సతీమణి అయిన ఈమె లోగడ పశ్చిమగోదావరి, ఖమ్మం, విజయనగరం జిల్లాల ఎస్పీగా సేవలందించారు. యాంటీ నక్సల్‌ యూనిట్లలోనూ సేవలందించారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌, ఏసీబీ డైరెక్టర్‌గా పనిచేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పనిచేస్తున్నప్పుడు అందించిన ఉత్తమసేవలకుగాను 2015లో కమెండేషన్‌ లెటర్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ గౌరవాన్ని పొందారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ స్పెషల్‌ కమిషనర్‌గా దిల్లీ నుంచి పనిచేశారు.

ఇదీ చదవండి :ఫైల్ వచ్చాక.. పరిపాలనపరమైన నిర్ణయం తీసుకుంటాం: హైకోర్టు

జస్వంత్‌రెడ్డికి శౌర్యచక్ర

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్‌ మారుప్రోలు జస్వంత్‌కుమార్‌రెడ్డికి శౌర్యచక్ర పురస్కారం దక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం సైన్యం, పోలీసు, ఇతర శాఖల్లో ఉత్తమ సేవలందించిన వారికి వివిధ పురస్కారాలను ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద గతేడాది జులై 8న ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో జస్వంత్‌రెడ్డి వీరమరణం పొందారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం. 2016లో మద్రాస్‌ రెజిమెంట్‌లో జవాన్‌గా ఆయన చేరారు. రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించి 15 మంది ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు.

ఇదీ చదవండి :New Districts in AP: రాష్ట్రంలో ఇకపై 26 జిల్లాలు.. నోటిఫికేషన్‌ జారీ

ప్రతిభా పతకాలు...

1. వి.రాజశేఖర్‌బాబు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, లా అండ్‌ ఆర్డర్‌

2. ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా

3. వాకా శ్రీరాంబాబు, డీఎస్పీ, సీఐటీ, ఆర్వో, నెల్లూరు

4. కైలే విజయపాల్‌, ఏసీపీ, ఈస్ట్‌ జోన్‌, విజయవాడ

5. బుల విజయ్‌కుమార్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌, గ్రేహౌండ్స్‌, విశాఖపట్నం

6. కొలగాని సుబ్రహ్మణ్యం, అదనపు డిప్యూటీ కమిషనర్‌, విశాఖపట్నం

7. చుండూరు శ్రీనివాసరావు, డీఎస్పీ, ప్రాంతీయ వీ అండ్‌ ఈ కార్యాలయం, గుంటూరు

8. గంగాధర నెల్లూరు వీరరాఘవరెడ్డి, డీఎస్పీ, అనంతపురం

9. ఎర్రమోర్సు రవీంద్రరెడ్డి, డీఎస్పీ, కర్నూలు

10. గొల్ల కృష్ణారావు, ఎస్సై, సీసీఎస్‌, విజయవాడ సిటీ

11. సత్తారు సింహాచలం, అసిస్టెంట్‌ రిజర్వు ఎస్సై, కమాండెంట్‌ 3 కాకినాడ

12. తూమాటి నరేంద్రకుమార్‌, అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, గుంటూరు అర్బన్‌

13. పేరూరు భాస్కర్‌, ఏఎస్సై, రెండో పట్టణ ఠాణా, వైఎస్సార్‌ కడప

14. నాగశ్రీనివాస్‌ సైరుంగ్‌, ఏఎస్సై, కొవ్వూరు గ్రామీణ ఠాణా

15. సింగంశెట్టి వీరాంజనేయులు, ఏఎస్సై, ఏసీబీ, విజయవాడ

* అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన అన్ని రంగాల్లోని వారికి జీవన్‌రక్ష పతకాలు అందజేస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన జీవన్‌ రక్ష పతకాల్లో ఏపీకి చెందిన ఐదుగురికి చోటు దక్కింది. వారిలో జి.సంజయ్‌కుమార్‌, టి.వెంకటసుబ్బయ్య, నిరజోగి గణేష్‌కుమార్‌, బంటి కుమార్‌భారతి (భారతీయ కోస్ట్‌గార్డ్‌), బొంగు నరసింహారావు (రైల్వే) ఉన్నారు. జైళ్ల శాఖలో హెడ్‌వార్డర్‌ అయినపర్తి సత్యనారాయణకు విశిష్ట సేవా పతకం లభించింది. ఇదే శాఖలో ప్రతిభా పతకాలను ఐదుగురికి ఇచ్చారు. డీఎస్పీలు పోచ వరుణ్‌రెడ్డి, పెదపూడి శ్రీరామచంద్రరావు, మహ్మద్‌ షఫీఉర్‌ రహ్మాన్‌, హంసాపాల్‌లతో పాటు వార్డర్‌ సముడు చంద్రమోహన్‌కు ఈ పతకాలు దక్కాయి.

ఇదీ చదవండి :new districts in ap : నూతన జిల్లాల స్వరూపం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 26, 2022, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details