ఇడా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అమెరికా అతలాకుతలం అవుతోంది. మృతుల సంఖ్య 46కు చేరింది. న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని తెలుగు కుటుంబాలూ తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఒకరిద్దరు గల్లంతైనట్లు నిర్ధారణ కాని వార్తలు వస్తున్నాయని అక్కడి ప్రవాసాంధ్రులు తెలిపారు. ముఖ్యంగా న్యూజెర్సీలోని మిడిల్‌సెక్స్, గ్లోసస్టర్, సోమర్‌సెట్ వంటి కౌంటీల్లోని వివిధ నగరాల్లో స్థిరపడిన కొందరి తెలుగువారి ఇళ్ల బేస్‌మెంట్లలోకి నీళ్లు వచ్చేశాయని, టోర్నడో ప్రభావంతో పైకప్పులు దెబ్బతిని వాన నీరు ఇళ్లల్లోకి వచ్చిందని ప్రిన్స్‌స్టన్‌లో స్థిరపడిన వాసిరెడ్డి రామకృష్ణ ‘ఈనాడు, ఈటీవీ భారత్’కి ఫోన్‌లో తెలిపారు.
‘‘బుధవారం రాత్రి అయిదు గంటల వ్యవధిలోనే 8-9 అంగుళాల వర్షం కురిసింది. చాలామంది తెలుగువారి ఇళ్లల్లోకి నీరు వచ్చింది. ముఖ్యంగా బేస్‌మెంట్‌లు మునిగిపోయాయి. ఇక్కడ ప్రతి ఇంటి బేస్‌మెంట్‌లో ఒక సంప్ ఉంటుంది. దానికి ఒక సబ్‌మెర్సిబుల్ మోటారు ఉంటుంది. భారీ వర్షాలకు బయటి నుంచి వచ్చిన నీళ్ల కంటే... భూమిలోంచి సంప్‌లోకి ఉబికి వచ్చిన నీళ్లతోనే బేస్‌మెంట్‌లు మునిగిపోయాయి. ఆ నీటిని తోడేందుకు... మోటార్లను ఏకధాటిగా పని చేయించడంతో అవి చెడిపోయాయి’’ అని రామకృష్ణ వివరించారు. ‘‘పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. చాలా రహదారుల్ని రాకపోకలకు తెరిచారు. నదులు, కాలువలకు సమీపంలో ఉన్న 20-30% రోడ్లు మాత్రం ఇంకా మూసేసి ఉన్నాయి’’ అని ఆయన వివరించారు.