TS High court on Pubs: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని పబ్‌లను ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. జూబ్లీహిల్స్‌లోని నివాస ప్రాంతాల్లో పబ్‌లను తొలగించాలన్న పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. నివాస ప్రాంతాల్లో పబ్‌లు ఏర్పాటు చేసి.. పార్కింగ్ సమస్యలు సృష్టిస్తున్నారని.. విపరీతమైన శబ్ధకాలుష్యానికి కారకులవుతున్నారని స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్ శాఖను కూడా ఉన్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చింది.
ఏం చర్యలు తీసుకుంటున్నారు
జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లో ఉన్న పబ్‌ల నుంచి వచ్చే శబ్ద కాలుష్యంతో పాటు ఇతర ఇబ్బందుల నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు సంవత్సరాంతపు, నయా సాల్ వేడుకలకే పరిమితం కాకుండా చూడాలంది. ఈ విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. నివాస ప్రాంతాల్లో పబ్‌లుండటమే సరైన నిర్ణయంకాదని.. డిసెంబరు 31, జనవరి 1లను దృష్టిలో ఉంచుకుని ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ విచారణను జనవరి 6 కి వాయిదా వేశారు.