Singareni Workers Strike: సింగరేణి సంస్థకూ ప్రైవేటు పోరు తప్పేలా లేదు. ఇంతకాలం నిల్వలున్న ప్రాంతాల్లో కొత్త గనులు తవ్వుకుంటూ వస్తోన్న సంస్థ నెత్తిన కేంద్రం ‘వేలంలో పాడుకుంటేనే’ అనే కొత్త కుంపటి పెట్టడమే దానికి కారణం. దీని ప్రభావం నూతన థర్మల్ విద్యుత్తు కేంద్రాలపైనా పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలోని గనుల వేలానికి సంబంధించి కేంద్రం ఇటీవల ‘ఖనిజాలు, గనుల అభివృద్ధి’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గనులను వేలం వేసి అధిక ధర కోట్ చేసిన వారికి కేటాయించడమే ఈ విధానం. వేలం జాబితాలో తొలిసారి తెలంగాణలోని నాలుగు కొత్త బొగ్గు గనులను నమోదు చేసింది. ఈ నెల 13న వేలం జరగనున్న నేపథ్యంలో కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు ఈ నెల 9 నుంచి 3 రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చాయి.
చేసిన ఖర్చంతా వృథాయేనా?
Singareni Labor Strike : గోదావరి పరీవాహక ప్రాంతంలో బొగ్గు తవ్వకాల కోసం నిజాం ప్రభుత్వ హయాంలోనే సింగరేణి సంస్థకు 44 అనుమతులు (లైసెన్సులు) ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రాంతాలకు బయట ఉన్న గనులను కేంద్రం వేలం జాబితాలో చేర్చింది. నిజానికి ఈ నాలుగు గనుల్లో బొగ్గు నిల్వల అన్వేషణ, మౌలిక సదుపాయాల కోసం సంస్థ కొన్నేళ్లుగా రూ.167 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ నాలుగు.. పాత గనుల పక్కనే ఉండటం వల్ల వాటి నుంచి బొగ్గు తవ్వడం సులభం. అవి ప్రైవేటుపరమైతే ఇప్పటివరకూ చేసిన ఖర్చు వృథా కావడంతో పాటు, ఆయా కంపెనీలకు ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లవుతుందని సంస్థ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.