new year celebrations Guidelines : తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పబ్బులు, హోటళ్లు, క్లబ్‌ల యాజమాన్యాలకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు మార్గదర్శకాలు జారీ చేశాయి. వేడుకల అనుమతి కోసం నిర్వాహకులు రెండు రోజుల ముందే ఆయా పోలీసు కమిషనర్‌లకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశాయి. వేడుకలు నిర్వహించే సమయంలో విధిగా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసులు తెలిపారు. మాస్కు ధరించకుంటే వెయ్యి రూపాయలు జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. వేడుకలకు 48 గంటల ముందు నిర్వాహకులు, సిబ్బంది కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. రెండు డోసుల టీకా తీసుకున్న వారినే వేడుకలకు అనుమతించాలని.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా నిర్వాహకులకు చూపించాలని మార్గదర్శకాల్లో పోలీసుశాఖ స్పష్టం చేసింది.
ఆరుబయట డీజేలు బంద్..
వేడుకులకు టిక్కెట్లు, పాస్‌లు వంటివి జారీ చేయవద్దని... దీని వల్ల ఎక్కువ మంది వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆరుబయట వేడుకలకు డీజే అనుమతి లేదని.... మోతాదుకు మించిన ధ్వనిపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసభ్యకర నృత్యాలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేడుకల్లో మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాలు అనుమతిస్తే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.