ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు. అంటే... యుగ+ఆది అని అర్థం. యుగము అంటే జత అనే అర్థం కూడా వస్తుంది. అలా ఉత్తరాయణం, దక్షిణాయనం జతగా కలిస్తే ఒక సంవత్సరంగా భావిస్తాం. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని అంటారు. ఉ అంటే నక్షత్రమనీ, గ అంటే గమనమనీ... దాన్ని ఈ రోజునుంచే లెక్కిస్తారని కూడా చెబుతారు. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ రోజు నుంచే సృష్టిని ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే... మొదటి సంవత్సరం, మొదటి రుతువు, మొదటి మాసం, మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాదికి ‘ప్లవ’ నామ సంవత్సరమని పేరు. ప్లవను ప్రతిభ, జ్ఞానానికి సంకేతంగా గుర్తిస్తారు. అన్ని పండగల్లానే ఉగాది నాడు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆ తరువాత ఉగాది పచ్చడి తినడంతోనే పండగ అయిపోదు. ఈ రోజున ప్రత్యేకంగా ఫలానా దేవుడిని పూజించాలని ఏ పురాణాల్లోనూ చెప్పలేదు కాబట్టి ఇష్టదేవతా స్మరణ చేసి.. ఆ తరువాతే షడ్రుచుల ఉగాది పచ్చడిని తీసుకోవాలి. అయితే... సృష్టి ప్రారంభం అయ్యేది కూడా ఈ రోజునే కాబట్టి భూమిని పాలించే ప్రభువును దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.
అంటే.. పరమేశ్వరుడిని మించిన ప్రభువు ఉండడు కాబట్టి శివాలయానికి వెళ్లి జగానికే మాతాపితలైన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకుంటే మంచిదని చెబుతారు. లేదంటే లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నా అంతే పుణ్యం లభిస్తుందనీ అంటారు. ఆ తరువాత గో దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. సాధారణంగా ఉగాది పచ్చడి తయారీలో ఉప్పు, పులుపు, వగరు, చేదు, కారం, తీపి కలిపి ఆరు రుచులుంటాయి. ఈ షడ్రుచులు ఏడాదంతా ఎదురయ్యే సుఖదుఃఖాలకూ కష్టనష్టాలకూ సంకేతంగా భావిస్తారు.
ఆరోగ్యపరంగా చూస్తే... ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజున మాత్రమే కాక శ్రీరామ నవమి వరకూ తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటన్నింటితోపాటూ పంచాంగ శ్రవణాన్ని కూడా ఉగాది పర్వదినంలో ఓ భాగంగా పరిగణిస్తారు. పంచాంగాన్ని వినడం వల్ల ఏడాది కాలంలో గ్రహాల కదలికలూ, శుభాశుభ ఫలితాలూ తెలుస్తాయి. వాటన్నింటినీ తెలుసుకోవడం వల్ల రాబోయే పరిస్థితుల్ని ముందే అర్థంచేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవచ్చనేది పంచాంగ శ్రవణం ప్రధాన ఉద్దేశం.
వసంత నవరాత్రుల ప్రారంభం..