చైనాలో కరోనా వైరస్ ప్రబలిన వుహాన్ నగరంలో తెలుగు యువ ఇంజినీర్లు చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుంచి ప్రాంగణ నియామకాల ద్వారా శ్రీసిటీ టీసీఎల్ కంపెనీకి 96 మంది యువ గ్రాడ్యుయేట్లు ఎంపికయ్యారు. వీరిని చైనా కేంద్ర కార్యాలయం వుహాన్‌లోని ఆప్టో డిస్ప్లే టెక్నాలజీ ప్రైవేట్ కంపెనీకి 3 నెలల శిక్షణ నిమిత్తం పంపించారు. ఆగస్టులో వెళ్లిన 96 మంది ఇంజినీర్లలో 38 మంది స్వదేశానికి వచ్చేయగా, మిగిలిన 58 వుహాన్ కంపెనీకి చెందిన హాస్టల్లోనే ఉండిపోయారు.
కరోనా వైరస్ ప్రబలిన తరుణంలో ఆ సంస్థ... వీరిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నించింది. అప్పటికే నిషేధం నిబంధనలు అమల్లోకి వచ్చిన కారణంగా.. కంపెనీ నిస్సహాయత వ్యక్తం చేసింది. అక్కడ శిక్షణ పొందుతున్న ఈ బృందం వారంతా తెలుగువారే.