తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద పండుగైన మహానాడు నిర్వహణకు ఆ పార్టీ సిద్ధమైంది. కొవిడ్ విజృంభణతో ఈ నెల 26, 27 నుంచి రెండ్రోజుల పాటు ఆన్‌లైన్ వేదికగానే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రెండు రోజులూ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడున్నర నుంచి ఆరు గంటల వరకు నిర్వహిస్తారు. గత సంవత్సరం పార్టీ అధినేత చంద్రబాబు సహా, ముఖ్య నేతలు ఆరేడుగురు మంగళగిరి సమీపంలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్ మహానాడులో పాల్గొన్నారు. ఈసారి కరోనా వ్యాప్తి మరింత ఉద్ధృతంగా ఉండటం, ఉభయ రాష్ట్రాల్లోనూ ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచే మహానాడులో పాల్గొంటారు. మిగతా నాయకులు కూడా ఎక్కడివారు అక్కడి నుంచే కార్యక్రమంలో భాగస్వాములవుతారు. వేడుకలో చేపట్టాల్సిన తీర్మానాలు, చర్చించాల్సిన అంశాలపై ప్రణాళికను పార్టీ నేతలతో ఇప్పటికే అధినేత చంద్రబాబు చర్చించారు. సంతాప, రాజకీయ తీర్మానాలు, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కి నివాళితో పాటు, మరో 13 అంశాలపై తీర్మానాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రజా సమస్యలపై ఎనిమిది, తెలంగాణకు సంబంధించి ఐదు తీర్మానాలు ప్రవేశపెడతారు.
తొలి రోజు చంద్రబాబు ప్రారంభోపన్యాసంతో కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం ఏడాది కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు నివాళులర్పించి, సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. తొలి రోజు రాష్ట్రానికి సంబంధించి.. 'కొవిడ్ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు - తలకిందులైన కుటుంబ ఆదాయం', 'రాష్ట్ర ఉగ్రవాదం - చట్టాలకు విఘాతం- ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు', 'అదుపులేని ధరలు- పెంచిన పన్నులు - అప్పులు', 'పరిశ్రమలపై దాడులు - అమరావతి సంపద విధ్వంసం - పెరుగుతున్న నిరుద్యోగం' అన్న అంశాలపై తీర్మానాలు ప్రవేశపెడతారు. తొలి రోజు తెలంగాణకు సంబంధించి రెండు తీర్మానాలు ఉంటాయి.