Husband killed wife in moosapet: అనుమానం పెనుభూతంగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. చివరికి ఆమె ఉసురు తీసుకునే వరకూ నిద్రపోలేదు. చీటికిమాటికీ అవమానాలతో మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. మద్యానికి బానిసై ప్రతి నిత్యం ఆమెతో గొడవలకు దిగేవాడు. అనురాగాలు, ఆప్యాయతలు ఉండాల్సిన వారి కొత్త కాపురంలో అనుమానం చిచ్చు రేపింది. చివరికి కట్టుకున్న భార్యను చంపి.. పోలీసులకు దొరకకూడదని పరారయ్యాడు. తెలంగాణలోని హైదరాబాద్ కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యకు గల కారణాలను కూకట్పల్లి పోలీసులు మీడియాకు వెల్లడించారు.
వేరు కాపురం పెట్టి..
Husband killed wife: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంతోష్.. బాల్యంలోనే తన తల్లిదండ్రులతో సహా ముసాపేటలో స్థిరపడ్డాడు. వెల్డింగ్ షాపులో వర్కర్‌గా పనిచేస్తున్న సంతోష్.. స్థానికంగా నివాసం ఉంటున్న పుణ్యావతిని(20).. 2021 మే లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మూసాపేటలోనే వేరు కాపురం పెట్టారు. అనంతరం పెళ్లైన కొద్ది రోజులకే సంతోష్.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతో ఆమె తన కుటుంబ సభ్యులతో సహా ఎవరితో మాట్లాడకూడదంటూ షరతులు విధించాడు. మానసికంగా వేధింపులకు పాల్పడేవాడు. భర్త వేధింపులకు విసిగిన పుణ్యావతి.. అమ్మానాన్న, అత్తామామలకు ఫిర్యాదు చేసింది. ఇరు కుటుంబాలు జోక్యం చేసుకుని.. గొడవలు మాని, సఖ్యతతో ఉండాలని సంతోష్‌కు సూచించారు. పుణ్యావతి తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడకూడదని.. అలా అయితే మంచిగా ఉంటానని చెప్పడంతో వాళ్లు దానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్న సంతోష్.. మళ్లీ మొదటికి వచ్చాడు. ప్రవర్తన మార్చుకోకుండా మద్యం సేవించి నిత్యం భార్యతో గొడవపడేవాడు.