ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా హైదరాబాద్ యువకుడు నీలకంఠ భాను ప్రకాశ్ నిలిచారు. అంతేకాదు, ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగానూ చరిత్ర సృష్టించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతోన్న భాను.. లండన్‌లో ఆగస్టు 15న జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో పాల్గొని మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నాడు.
ఐదేళ్ల నుంచే..
మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌ను 1998 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో 13 నుంచి 50 ఏళ్లలోపు ఉన్న 13 దేశాలకు చెందిన 30 మంది పాల్గొన్నారు. ఇందులో భాను 65 పాయింట్లతో మొదటి స్థానం సాధించగా.. లెబనాన్, యూఏఈకి చెందిన యువకులు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. నీల్‌కంఠ భాను ఐదేళ్ల వయసులోనే సిప్ అబాకస్ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకుని, తొమ్మిది దశలను పూర్తిచేశాడు. అలాగే, ఇంటర్నేషనల్ అబాకస్ ఛాంపియన్‌లో 13, నేషనల్ అబాకస్ ఛాంపియన్‌లో 11, 12 టైటిళ్లను గెలుపొందాడు.
పుత్రోత్సాహం
తన కుమారుడు భారతదేశానికి గర్వకారణంగా మారినందుకు భాను తండ్రి శ్రీనివాస్ జొన్నలగడ్డ సంతోషం వ్యక్తం చేశారు, గణితమంటే ఉన్న భయాన్ని నిర్మూలించాలనే దిశగా భాను పయనిస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లల మెదడుకి శిక్షణా వంటి టెక్నిక్స్‌ను నేర్పిస్తూ వారిని గణితం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని ఆయన సూచించారు.