Telangana Withdrawn RTI Circular: ఆర్టీఐ వివాదాస్పద ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సమాచారం ఇచ్చేముందు శాఖాధిపతుల నుంచి ముందస్తు అనుమతి పొందాలంటూ అక్టోబరు 13న సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గతంలోనే విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం.. ప్రభుత్వ ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తం చేసి స్టే విధించింది.
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా అక్టోబరు 13 నాటి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అవసరమైతే శాఖాధిపతుల సహకారం, సలహా తీసుకోవాలని సమాచార శాఖ అధికారులకు తెలపాలంటూ ఇవాళ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.