పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇప్పటివరకు ఉన్న 11 పరీక్షలను ఆరుకు కుదించాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. పదో తరగతికి తప్పనిసరిగా ఏదో ఒక రూపేణా పరీక్షలను నిర్వహించాలన్నది విద్యాశాఖ నిర్ణయం. మే నెల మధ్య నుంచి పరీక్షలను ప్రారంభించాలని రెండు నెలల క్రితమే విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటివరకు విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమైనందున గతంలో మాదిరిగా పరీక్షలు నిర్వహిస్తే ఒత్తిడికి గురవుతారని అధికారులు భావిస్తున్నారు.
విద్యాశాఖ కసరత్తు
గత ఏడాది వరకు హిందీ తప్ప మిగిలిన సబ్జెక్టుల్లో ఒక్కోదానికి రెండు పేపర్లు ఉండేవి. ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష జరపాలన్నది యోచన. అంతేకాకుండా ప్రశ్నల్లో ఛాయిస్‌తోపాటు బహుళ ఐచ్ఛిక ప్రశ్నల సంఖ్య కూడా పెంచనున్నారు. దీనిపై రెండు నెలల క్రితమే చిత్రా రామచంద్రన్ ఆదేశించారు. ఈ క్రమంలోనే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.50 లక్షల మంది పదో తరగతి విద్యార్థులున్నారు. బడులు తెరిచిన తర్వాత పనిదినాలను బట్టి తుది నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాలు చెబుతున్నాయి.
పండగల తర్వాతే?...
బడులు తెరవడంపై విద్యాశాఖ ఆలోచనలు, ప్రతిపాదనలు మారుతూనే ఉన్నాయి. తాజాగా సంక్రాంతి తర్వాత 9, 10, తరగతులకు విద్యాసంస్థలను తెరిచి ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరు వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లో తెరవరాదని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.