Students in Ukraine: ఉక్రెయిన్లో కొనసాగుతున్న దాడుల కారణంగా భీకర వాతావరణం నెలకొంది. రాజధాని కీవ్ తోపాటు పలు కీలక నగరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆయా నగరాల్లోని జనాలు సురక్షిత ప్రాంతాలకూ తరలిపోతున్నారు. ఉన్నత విద్యకోసం ఉక్రెయిన్ వెళ్లిన రాష్ట్ర విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. యుద్ధ విమానాల బీభత్సం, బాంబుల మోత కొనసాగుతున్న వేళ తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడి భయానక పరిస్థితులను ఇక్కడి కుటుంబ సభ్యులకు వివరిస్తూ.. తమను కాపాడాలను వేడుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి తమ పిల్లలను భారత్ కు రప్పించాలంటూ.. వారి కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తిండి కూడా లేకుండా..
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడకు చెందిన వేముల కీర్తి ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతోంది. భయానక పరిస్థితుల నేపథ్యంలో వారంతా ఓ మెట్రోస్టేషన్‌లో తినడానికి తిండి కూడా లేకుండా గడుపుతున్నట్లు తెలిపింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ ఉక్రెయిన్‌లో చిక్కుకోవడంతో తల్లిదండ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సురక్షితంగా తమ కుమారుడిని దేశానికి వచ్చేలా ప్రభుత్వాలు చూడాలని తండ్రి నర్సింహులు కోరుతున్నారు.
మరికొన్ని రోజుల్లో వద్దామని..
మెదక్‌కు చెందిన రాగం మధు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఎంబీబీఎస్ అభ్యసిస్తున్నాడు. ఫైనల్ ఇయర్ చదువుతున్న మధు... మరికొన్ని రోజుల్లో పరీక్షలు పూర్తి చేసుకుని భారత్‌కు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడని.. ఇంతలోనే ఇలా యుద్ధంలో చిక్కుకుపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తలదాచుకునేందుకు స్థలం లేక..
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం మెడిదపల్లిపాలెం గ్రామానికి చెందిన రావుల మహేశ్‌రెడ్డి హోటల్ మేనేజ్‌మెంట్ కోసం ఉక్రెయిన్‌కు వెళ్లి అక్కడే చిక్కుకున్నాడు. తమ పరిస్థితి దారుణంగా ఉందని వీడియో పంపడంతో... తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.