ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఊపిరి ఆడటం లేదు…ఆసుపత్రికి తీసుకెళ్లండి అంటూనే…!!

‘నాయినా..! చాలా ఇబ్బందిగా ఉంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది. నా పరిస్థితి చేయిదాటిపోతోంది.. ఎవరికి ఫోన్ చేసినా కరోనా అని దగ్గరికి రావడం లేదు.. వచ్చి సాయం చేయి..’ అంటూ సమీప బంధువును ఫోన్లో ప్రాధేయపడిన రెండు గంటలకే ఆ వ్యక్తి కన్నుమూశారు. సదరు బంధువు బాధితుడిని రక్షించేందుకు 108 అంబులెన్సును సంప్రదించగా అది 45 నిమిషాల తరువాత రావడం గమనార్హం. అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ దయనీయ ఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో జరిగింది.

Telangana: saying not able to breathe please take me to hospital!!
తెలంగాణ: ఊపిరి ఆడటం లేదు…ఆసుపత్రికి తీసుకెళ్లండి అంటూనే…!!

By

Published : Jul 18, 2020, 8:23 PM IST

కరోనా కోరల్లో చిక్కుకున్న తల్లి మృతిచెందిన మూడు రోజుల వ్యవధిలోనే కుమారుడూ మరణించిన విషాదఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కలకలం రేపింది. దుబ్బాక పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు (70) మంగళవారం రాత్రి చనిపోయారు. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు బుధవారం వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆమె ఇంట్లోని ఎనిమిది మంది కుటుంబసభ్యులు ఈ పరిణామంతో స్వీయ గృహనిర్బంధంలో ఉన్నారు. ఈక్రమంలోనే ఆమె కుమారుడు (56) అనారోగ్యం బారినపడ్డారు.

అందరూ ఇంట్లోనే ఉన్నా.. ఆయన వద్దకు ఎవరూ వెళ్లలేదు. ఎలాంటి వైద్య సదుపాయం అందక శుక్రవారం ఇంటి వద్దనే ఆయన చనిపోయారు. వైద్య సిబ్బంది, పోలీసుల నేతృత్వంలో ఆలస్యంగా చేరుకున్న అంబులెన్సులో ఆయన మృతదేహాన్ని స్థానిక శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

కరోనా లక్షణాలు లేకపోవడంతో ఎలాంటి పరీక్షలు చేయలేదని తెలిపారు. భయాందోళనతో మృతిచెంది ఉంటారని తిమ్మాపూర్‌ పీహెచ్‌సీ పర్యవేక్షకుడు రాజచైతన్య తెలిపారు.

మృతుడి కుటుంబసభ్యులకు సిద్దిపేట కొవిడ్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు లేవని, ఇంటికి వెళ్లాలని వారికి సూచించారు. తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని రాతపూర్వకంగా వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి వాహన సదుపాయం కల్పించకుండా సొంతూరికి ఎలా వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి ఆర్‌ఎంవో కాశీనాథ్‌ దృష్టికి తీసుకెళ్లగా వాహన సదుపాయం కల్పించి దుబ్బాకకు పంపిస్తామని చెప్పారు.కాగా బంధువుతో ప్రాధేయపడిన సంభాషణ, ఆయన అంబులెన్సు సిబ్బందితో మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అంబులెన్సు సిబ్బంది వైఖరిని, ఉదాసీనతను పలువురు తప్పుబట్టారు.

ఇవీ చదవండి: అమరావతిపై సీఎం ఒక్కమాట మాట్లాడకపోవడం దారుణం: దేవినేని

ABOUT THE AUTHOR

...view details