ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ సచివాలయం ఏడంతస్తుల మేడ.. - minister prasanth reddy speaks on new secretariat

తెలంగాణ సీఎం కేసీఆర్​ సంకల్ప బలంతో చేపట్టిన ప్రాజెక్టులను సునాయాసంగా పూర్తి చేస్తున్నామన్నారు.. మంత్రి ప్రశాంత్​రెడ్డి. సచివాలయం నిర్మాణం, విభాగాధితుల కార్యాలయాలు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై పలు పశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

telangana-r-and-b-minister-prasanth-reddy-speaks-on-secretariat-construction
తెలంగాణ సచివాలయం ఏడంతస్తుల మేడ

By

Published : Nov 8, 2020, 11:07 AM IST

'ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్ప బలంతో చేపట్టిన ఏ ప్రాజెక్టునైనా సునాయాసంగా పూర్తి చేస్తున్నాం. సచివాలయ ప్రాంగణాన్ని గడువు కన్నా ముందే పూర్తి చేసేందుకు సమాయత్తమవుతున్నాం. ముఖ్యమంత్రి ఏదైనా అంశాన్ని చేపడితే ఉదయం లేవగానే, రాత్రి పడుకోబోయే ముందు ఆయా అంశాలపై అన్ని స్థాయిల వారితో మాట్లాడుతుంటారు. పురోగతిని ట్రాక్‌ చేస్తుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేశాం. ప్రగతిభవన్‌ను తొమ్మిది నెలల్లో, యాదాద్రి ప్రధాన ఆలయాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేశాం. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏడో అంతస్తులో ఉంటుంది. విభాగాధిపతుల(హెచ్‌వోడీ) కార్యాలయాలు సచివాలయానికి సమీపంలో నిర్మిస్తాం. ఎక్కడ అన్నది ఇంకా ఖరారు కాలేదు. అసెంబ్లీ, మండలికి కూడా నూతన భవనాల నిర్మాణం అనివార్యం. జాతీయ రహదారుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. పనులు చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తాం' అని రాష్ట్ర రహదారులు-భవనాలు, గృహనిర్మాణం, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్​'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రశ్న: సచివాలయ నూతన భవన నిర్మాణాన్ని ఆరు ప్రాజెక్టులుగా విభజించటంలోని ఆంతర్యం ఏమిటి?

జవాబు:ఇంత పెద్ద నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే రెండేళ్లకుపైగా పడుతుంది. ఆరు ప్రాజెక్టులుగా విభజించడం వల్ల పనిలో వేగం, జవాబుదారీతనం పెరుగుతుంది. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయటంతో పాటు ఎవరి పనికి వారే బాసులు. వారే బాధ్యత తీసుకోవాలి. లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. 365 రోజుల్లో ఏయే పని చేయాలో అన్నది కూడా ముందస్తుగానే నిర్ణయించి ఆ మేరకు చేస్తాం. ప్రతి ప్రాజెక్టుకు సిబ్బంది.. పర్యవేక్షకులు వేరుగా ఉంటారు. పని విషయంలో ఎక్కడా రాజీపడేది లేదు.

ప్రశ్న: ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు?

జవాబు:సచివాలయ స్థలం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు అంతస్తుల్లో నిర్మిస్తున్నాం. మిగిలిన ఎత్తు అంతా ఎలివేషన్‌లో భాగం. అక్కడి స్థలాన్ని వివిధ అవసరాలకు వినియోగిస్తాం. ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, మేమూ పేరుకు మాత్రమే. సచివాలయం ఎలా ఉండాలి? ఎక్కడ ఏముండాలన్నదీ ముఖ్యమంత్రి ఆలోచనే.

ప్రశ్న: విభాగాధిపతుల కార్యాలయాలు ఎక్కడ?

జవాబు:ప్రస్తుతం వివిధ శాఖల విభాగాధిపతులు (హెచ్‌వోడీ) ఒక్కొక్కరు ఒక్కోచోట ఉన్నారు. వారంతా ఒకే ప్రాంగణంలో ఉండాలి. సచివాలయానికి సమీపంలో ఉండాలన్నది ఆలోచన. ఎక్కడ నిర్మించాలన్నది ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుత అసెంబ్లీ భవనాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలోనే శ్లాబు పెచ్చులూడుతున్నాయి. అసెంబ్లీ, మండలికి కూడా నూతన భవనాల నిర్మాణం అనివార్యం.

ప్రశ్న: ఇళ్ల నిర్మాణం ఏ స్థితిలో ఉంది?

జవాబు:2.83 లక్షల 2 పడక గదుల ఇళ్లు మంజూరయ్యాయి. రెండు లక్షల ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాం. గ్రేటర్‌ హైదరాబాద్‌లో చేపట్టిన లక్ష ఇళ్లల్లో ఇప్పటికి సుమారు 60 వేలు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన వాటిల్లో 25 వేల నుంచి 30 వేలు పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో గ్రేటర్‌ పరిధిలో 70 వేల ఇళ్ల వరకు పూర్తి కానున్నాయి. నిర్మాణ పనులు ప్రారంభించిన వాటన్నింటినీ ఏడాదిలోగా పూర్తి చేస్తాం.

ప్రశ్న: ప్రాంతీయ రింగు రోడ్డు పరిస్థితి ఏమిటి?

జవాబు:ఆరు వరుసలుగా రింగురోడ్డును కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. జాతీయరహదారిగా నంబరు కేటాయించలేదు. కేంద్రం ఇవ్వకపోతే కనీసం నాలుగు వరుసలుగానైనా చేపట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన.

ప్రశ్న: జాతీయ రహదారుల్లో వెనకపడినట్లున్నాం?

జవాబు:కేంద్రం రాష్ట్రానికి జాతీయ రహదారులను ప్రకటించటంలో నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటిస్తున్నా మరమ్మతులకు నిధులు విడుదల చేయటం లేదు. గడిచిన రెండేళ్లుగా పోరాటం చేస్తే జాతీయరహదారులు మరమ్మతులకు ఇటీవల రూ.200 కోట్లు ఇచ్చింది.

సచివాలయం ఇలా..

* సచివాలయ ప్రాంగణం మొత్తం 28.4 ఎకరాలు.. అన్ని రకాల దిద్దుబాట్ల తరవాత నికరంగా 25.42 ఎకరాలు...

* ప్రధాన ప్రాంగణం 4.13 ఎకరాల్లో...

* పచ్చదనం కోసం సుమారు అయిదు ఎకరాలు కేటాయింపు

* సచివాలయ భవనం ఎత్తు 278 మీటర్లు.. అంచనా వ్యయం రూ.617 కోట్లు

* ప్రధాన భవనం ఏడు అంతస్తులు. దానిపై నాలుగు అంతస్తుల ఎత్తులో డోమ్‌. దానిపై మరో అంతస్తు ఎత్తులో జాతీయ చిహ్నం.

* ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీఎస్‌ కార్యాలయం. ఆరు నుంచి మూడో అంతస్తు వరకు మంత్రుల కార్యాలయాలు. ఒక అంతస్తులో జీఏడీ.. మరో దాంట్లో అన్ని రకాల సర్వీసు విభాగాలు.

* మంత్రి కార్యాలయానికి అనుసంధానంగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆయన కార్యాలయం.

* ఒకే సారి రెండు హెలికాప్టర్లు దిగేందుకు వీలుగా హెలిప్యాడ్‌ నిర్మాణం.

* నిర్మాణ భాగాన్ని ఆరు ప్రాజెక్టులుగా విభజించి బాధ్యులు, సిబ్బంది నియామకం.

* 1,250 కార్లు, 475 ద్విచక్రవాహనాలు నిలిపేందుకు వీలుగా పార్కింగ్‌ సదుపాయం

* మూడు షిఫ్టుల పనుల్లో రోజుకు 2,500 మంది కార్మికులు

* వివిధ స్థాయులకు చెందిన వంద మంది అధికారులు

ఇదీ చదవండి:

కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో 5 రెవెన్యూ డివిజన్లు

ABOUT THE AUTHOR

...view details