TS Drugs Control Wings: డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపడమే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. మాదకద్రవ్యాల నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దన్న సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా.. డ్రగ్స్ నివారణ చర్యలు ముమ్మరం చేసింది. డ్రగ్స్‌పై నిఘా పెట్టేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్‌లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ కేంద్రంగా విధులు నిర్వర్తించనున్నాయి.
ఎవరేం చేస్తారు..
narcotics control wings in Telangana: నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్.. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నలుగురు ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తారు. హైదరాబాద్ సీపీ నేతృత్వంలో సీటీ టాస్క్‌ఫోర్స్ తరహాలో ఈ వింగ్ నిఘా పెడుతుంది. వ్యవస్థీకృత డ్రగ్ ట్రాఫికింగ్ గ్రూపులు, సరఫరాదారులు, పెడ్లర్లు, వినియోగదారులను గుర్తించి కఠినంగా వ్యవహరించడం ఈ వింగ్ విధి. ఇందుకోసం మౌలిక సదుపాయాలు, వాహనాలు, నిధులను ప్రభుత్వం సమకూరుస్తుంది. వీరికోసం ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్‌లో ఒక ఏసీపీ, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్‌ఐ, ఆరుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు. ఈ రెండు విభాగాలు స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానమై ఉంటాయి. ఈ ప్రత్యేక విభాగాలను డీజీపీ మహేందర్‌రెడ్డి.. రేపు ప్రారంభించనున్నారు.
ఎవరినీ వదలొద్దు..: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల నియంత్రణ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారినైనా సరే వదలొద్దని ఆదేశించారు. రెండు వారాల క్రితం ప్రగతిభవన్‌లో డ్రగ్స్ నియంత్రణపై కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణలో డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి పోలీసు అధికారులు బాధ్యతతో కృషిచేయాలని సూచించారు. దీన్నో సామాజిక ఉద్యమంలా మలిచినప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రజలను చైతన్యపరచడం సహా వెయ్యిమంది సుశిక్షితులైన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని, అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌ను తీర్చిదిద్దాలి. గ్రేహౌండ్స్ తరహాలో ఈ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
'నయా సవేరా' కార్యక్రమం..
మాదకద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజలు పోలీసులు కలిసి పనిచేయాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములవ్వాలని కోరారు. నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయంలో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా, నియంత్రణ చర్యలపై ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, రాచకొండ పరిధిలోని కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లతో సీపీ సమావేశమయ్యారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని.. వాటిని నిర్మూలించేందుకు కృషిచేస్తామంటూ.. వారితో ప్రమాణం చేయించారు. మత్తుపదార్థాల వినియోగంతో యువత.. తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ సరఫరాదారులు సహా వినియోగదారులనూ అరెస్ట్ చేస్తున్నట్లు సీపీ చెప్పారు. డ్రగ్స్‌కు కొందరు బానిసలుగా మారుతున్నారని.. వారికి చికిత్స అందించి.. కొత్త జీవితం ప్రారంభించేందుకు కృషిచేస్తున్నట్లు సీపీ మహేశ్‌భగవత్ చెప్పారు. ఇందుకోసం 'నయా సవేరా' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదీచూడండి:CM KCR on Drugs: 'డ్రగ్స్ నియంత్రణలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు'