తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఉన్నతన్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో సర్కారు వేగం పెంచింది. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే మిగిలిన కార్యాలయాలను తరలించి సచివాలయ భవనాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయించింది. ప్రాంగణంలో ఉన్న పాత వాహనాలు సహా సామగ్రి తరలించి కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తూ వచ్చింది.
తెలంగాణ రహదార్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులతో సంబంధిత అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్... పాత భవనాలను కూల్చివేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ అర్ధరాత్రి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తోపాటు ఇతర అధికారులు అందుకు సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షించారు.
పరిసరాల్లో ఆంక్షలు
తెల్లవారుజామునుంచి భవనాల కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. సచివాలయ ప్రాంగణంలో ఉన్న అతి పురాతనమైన జీ-బ్లాక్ సర్వహితను పూర్తిగా నేలమట్టం చేశారు. సీఎం కార్యాలయం ఉండే సీ-బ్లాక్ సమత కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. ప్రవేశద్వారం పక్కనున్న విద్యుత్ శాఖకు చెందిన పురాతన కట్టడాన్ని కూడా కూల్చివేసే పనులను చేపట్టారు.
కూల్చివేత కోసం వివిధ పద్ధతులను తెలంగాణ ప్రభుత్వం అన్వేషించింది. భవనం పూర్తిగా ఒకేమారు నేలమట్టమయ్యేలా ఇంప్లోజివ్ టెక్నాలజీ, పేలుడు పదార్థాలతో కూల్చివేత లాంటి విధానాలను పరిశీలించింది. అయితే హుస్సేన్ సాగర్ తీరాన ఉండడం, పరిసరాల్లో కార్యాలయాలు, ఇతర భవనాలు, ఖైరతాబాద్ ప్రాంతంలో నివాస గృహాలు తదితరాలను దృష్టిలో ఉంచుకొని అవన్నీ విరమించుకుంది.
చివరికి యంత్రాల సాయంతోనే భవనాలను కూల్చివేయాలని నిర్ణయించారు. సచివాలయం పరిసరాల్లో పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించారు. కూల్చివేత, ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ ఇవాళ సెలవు ప్రకటించారు.
ఆరు అంతస్తుల్లో...
నూతన సచివాలయ భవన నిర్మాణ నమూనా కూడా ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ నమూనాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నమూనాకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. సచివాలయ భవనం కోసం పలువురు ఆర్కిటెక్ట్‌లు రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే నమూనాలు పంపారు.