KTR Old City Visit : హైదరాబాద్ పాతబస్తీలో కొత్త నగిషీలు అద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పలుప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.... 495 కోట్ల 75 లక్షల రూపాయలతో చేపడుతున్న 6 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, హోంమంత్రి మహబూద్ అలీ, ఎమ్మెల్యేలతో కలిసి పాతబస్తీలో పర్యటిస్తున్న కేటీఆర్.. ముందుగా మీరాలం చెరువులోని మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను ప్రారంభించారు. 2 కోట్ల 55 లక్షలతో పూర్తిచేసిన ఈ మల్టీమీడియా మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. చెరువులో తీగల వంతెనతో పాటు మ్యూజికల్ ఫౌంటెయిన్, చుట్టూ కాలిబాట, సైకిల్ ట్రాక్, పార్కుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు.
KTR Old City Tour : పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ నూతన భవనం నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రస్తుత పరిస్థితులకు పాతభవనంలో ఇబ్బందులు తలెత్తుతున్నందున... మరోచోట పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించింది. హైదరాబాద్‌ను సిగ్నల్ రహిత నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా... వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా.... ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. ఈ ఎస్ఆర్డీపీలో భాగంగానే 108 కోట్ల రూపాయలతో బహదూర్‌పురలో 690 మీటర్ల పొడవున నిర్మించిన మల్టీలెవల్ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 13 ఫిల్లర్లు, ఇరువైపులా సర్వీస్ రోడ్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో... ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తీరనున్నాయి.
Minister KTR at Old City : పాతబస్తీలోని చారిత్రక కట్టడాల పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 90కోట్ల 45 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. 36 కోట్ల రూపాయలతో చార్మినార్ వద్ద ముర్గీ చౌక్‌గా పిలువబడే మహబూబ్ చౌక్‌ను పునరుద్ధరించనున్నారు. అలాగే... 21కోట్ల 90లక్షల వ్యయంతో చార్మినార్ జోన్‌లో మీరాలం మండిని ఆధునికీకరణ, 30 కోట్ల రూపాయతో చేపట్టే సర్దార్ మహల్ అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. మీర్‌ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటైన్‌ను కేటీఆర్ ప్రారంభించారు.
"ప్రజల మధ్య చిచ్చుపెట్టే వారిని కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. మతరాజకీయాలు చేసే వారిని సహించేది లేదు. శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఆచితూచి అడుగువేస్తోంది. ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త నగరానికి దీటుగా పాతబస్తీని తీర్చిదిద్దుతాం. "