KTR Comments on Modi : తెలంగాణ వస్తే ఏమొస్తుంది.. అన్న వాళ్లకు సమాధానం చెప్పామని ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. వేసవి వస్తే మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో రోజుకు 6 గంటల విద్యుత్‌ను విడతల వారీగా ఇచ్చేవారని.. ఇప్పుడు సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.
KTR Comments on PM Modi : దేశం కోసం ధర్మం అని చెప్పే భాజపా నేతలు.. దేశానికి ఏం చేస్తారో మాత్రం చెప్పరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కార్ ఎల్ఐసీకి రైతు బీమా అవకాశం ఇస్తే.. మోదీ మాత్రం ఆ సంస్థను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి ప్రధానిగా అవకాశమిస్తే తెలంగాణ, ఆంధ్రాను కలుపుతారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ అడిగితే.. వాట్సాప్ యూనివర్సిటీలో మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన రిజర్వేషన్లు పెంచమని అడిగి నాలుగేళ్లయినా.. ఇప్పటికి దాని గురించి ప్రస్తావన లేదని వాపోయారు. మోదీ కేవలం ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తర భారత్‌కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని మంత్రి విమర్శించారు.
నిజామాబాద్‌లో అభివృద్ధికి శ్రీకారం..
KTR Nizamabad Tour : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. సిద్దాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.120 కోట్లతో నిర్మించనున్న రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు స్పీకర్ పోచారం, మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
KTR Visited Nizamabad : "కులమతాలకు అతీతంగా తెరాస అభివృద్ధి చేస్తోంది. కానీ కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. విషం నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పే దమ్ము కేంద్రానికి ఉందా? నేను సవాల్ చేస్తున్నా.. ఇలా అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న స్థితి మోదీది. కర్ణాటకకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చిన మోదీ.. తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరుకు జాతీయ హోదా అడిగితే ఎందుకు ఇవ్వలేదు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న పార్టీ మనకు అవసరమా మీరంతా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలను అవమానిస్తుంటే ఇక్కడి భాజపా నేతలు ఏం చేస్తున్నారు."
- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి
తెలంగాణ సస్యశ్యామలం..
KTR Fires on BJP Government : అత్యధిక రెండు పడకగదుల ఇళ్లు బాన్సువాడ నియోజకవర్గంలోనే మంజూరయ్యాయని కేటీఆర్ అన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శాసనసభాపతి పోచారం కృషి కారణంగానే రూ.300 కోట్లతో రహదారుల నిర్మాణం జరిగిందని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో 46 వేల చెరువులకు జీవం పోశామని కేటీఆర్ వెల్లడించారు. గోదావరి నీటిని ఒడిసిపట్టి జిల్లాలను సస్యశ్యామలం చేశామని చెప్పారు. రైతుబంధు ద్వారా రూ.50 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో వేశామని వివరించారు.
కేటీఆర్‌ను అడ్డుకున్న భాజపా నేతలు..
అంతకుముందు.. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌ను భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. వర్ని మండలం సిద్దాపూర్ లో రూ.120కోట్లతో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సమయంలో ఘటన జరిగింది. పోలీసులు భాజపా కార్యకర్తలను అడ్డుకొని కేటీఆర్ పర్యటన సజావుగా సాగేలా చూశారు. ముందు నుంచే కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని భాజపా నేతలు ప్రకటించారు. నిన్నటి నుంచి అనేక మంది కార్యకర్తలు, నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. కార్యక్రమానికి వస్తున్న ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు పోలీసులు. అయినా అన్నింటినీ దాటుకుంటూ రిజర్వాయర్ వరకు వచ్చిన భాజపా కార్యకర్తలు కేటీఆర్‌ను అడ్డుకున్నారు.