తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు గాఢ దుర్గంధంపై ఈటీవీ భారత్ ప్రచురించిన కథనానికి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్(Telangana Municipal Minister KTR) స్పందించారు. ఆ 18 గ్రామాలకు ఊపిరాడడం లేదు!కథనానికి స్పందించి డంపింగ్ యార్డును పరిశీలించాల్సిందింగా మేయర్, ఇతర అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంఏయూడీ కమిషనర్ అరవింద్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ జవహర్‌నగర్ డంపింగ్ యార్డును పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణలో లోపాలు ఉన్నాయన్న స్థానికుల ఆరోపణలతో అధికారులు డంపింగ్ యార్డును సందర్శించారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు గాలిలోకి విషం చిమ్ముతోంది. గాఢ దుర్గంధంతో జనం శ్వాస పీల్చుకోలేకపోతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో.. డంపింగ్ యార్డు చుట్టూ ఉన్న 18 గ్రామాల ప్రజలు నరకం చూస్తున్నారు. రెండున్నర లక్షల మంది స్థానికులు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. వ్యర్థాల నిర్వహణలో లోపాలతో తమ బతుకులు ఛిద్రమవుతున్నాయని అధికార పార్టీ నేతలే నిరసన గళం వినిపిస్తుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటీవల తమ ప్రాంత ప్రజల సమస్యను దమ్మాయిగూడ పురపాలక సంస్థ ఛైర్‌పర్సన్ ప్రణీత ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్(Telangana Municipal Minister KTR) దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.