తెలంగాణ రాష్ట్ర పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు మున్సిపాలిటీల్లో గెలుపునకు సరిపడా స్థానాలు వెలువడ్డాయి. ఇప్పటివరకు వెల్లడైన స్థానాల్లో కారు జోరు కొనసాగుతోంది.
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం తెరాస ఖాతాలో చేరింది. 22 వార్డులకు గాను 17 తెరాస చేజిక్కించుకుంది. ఆందోల్- జోగిపేట మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 13 వార్డుల్లో గులాబీ విజయం సాధించింది. జోగిపేట 12వ వార్డులో మాత్రం స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. నారాయణ్‌ఖేడ్ మున్సిపాలిటీ హస్తగతమైంది. 15 వార్డుల్లో 8 కాంగ్రెస్, 7 తెరాస కైవసం చేసుకున్నాయి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో అత్యధిక వార్డుల్లో గెలుపొంది... తెరాస ఖాతాలో చేరింది. కామారెడ్డి జిల్లా భీంగల్ మున్సిపాలిటీలో తెరాస ఏకపక్ష విజయం నమోదు చేసింది. 12 వార్డుల్లోనూ గులాబీ విజయ బావుటా ఎగరేసింది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పురపాలిక సైతం తెరాస కైవసమైంది. మొత్తం 15 వార్డుల్లో తెరాస అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించారు.
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పురపాలికలోనూ తెరాస గెలుపు బావుటా ఎగరేసింది. 12 వార్డుల్లో 8 గులాబీ ఖాతాలో చేరాయి. 2 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా... భాజపా, స్వతంత్ర అభ్యర్థికి చెరో స్థానం లభించింది. పరకాల మున్సిపాలిటీలోనూ కారు జోరు కనబర్చింది. నర్సంపేట మున్సిపాలిటీ తెరాస కైవసం చేసుకుంది. 24 వార్డుల్లో 16 తెరాస, 6 కాంగ్రెస్, 2 ఇతరులు విజయం సాధించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలోనూ గులాబీ జెండా ఎగిరింది. ఛైర్మన్ పదవి కోసం అవసరమైన స్థానాలను తెరాస గెలుచుకుంది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 22 తెరాస దక్కించుకుని తన ఖాతాలో వేసుకుంటే... అదే పురపాలికలో 3 కాంగ్రెస్‌కు, 5 ఇతరులకు దక్కాయి. చొప్పదండి మున్సిపాలిటీలో తెరాస సత్తా చాటింది. 14 వార్డుల్లో 9 తెరాస, 2 కాంగ్రెస్, 2 భాజపా దక్కించుకోగా... ఇతరులు ఒకటి గెలుపొందారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 11 సొంతం చేసుకుని తెరాస ఏకపక్ష విజయం సాధించింది.