ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రిజర్వేషన్ల 50% పరిమితిని ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి - telangana mp bb patil talk about reservation limits in Lok Sabha

రిజర్వేషన్ల పరిమితులపై లోక్​సభ సమావేశాల్లో (lok sabha sessions) తెలంగాణ ఎంపీ బీబీ పాటిల్​ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు.

telangana-mp-bb-patil-talk
రిజర్వేషన్ల 50% పరిమితిని ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి

By

Published : Aug 11, 2021, 10:39 AM IST

రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని తెరాస ఎంపీ బీబీ పాటిల్‌ (mp bb patil) డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం లోక్‌సభలో ఓబీసీలను గుర్తించే అధికారాలను రాష్ట్రాలకే ఇస్తూ కేంద్రం తీసుకొచ్చిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓబీసీ జనగణన, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ‘‘తెలంగాణ నుంచి 40 సామాజిక వర్గాలు ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర ఓబీసీ జాబితాలో చోటు కోసం ఎదురు చూస్తున్నాయి. ఓబీసీ జనగణనను ఇప్పటికైనా కేంద్రం చేపడితే వారి స్థితిగతుల గురించి స్పష్టంగా తెలిసి వస్తుంది. ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.

దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి: నామ

తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు (trs mp nama nageswara rao) మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం దేశంలో తొలిసారి దళితబంధు పథకం తీసుకొచ్చింది. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తోంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు కల్పించే బిల్లుకు మేం సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం’’ అన్నారు.


పత్రాలు అందక విడుదల కాని వందల కోట్లు

కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అమలు చేస్తున్న రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ పథకం కింద గత అయిదేళ్లలో తెలంగాణకు రూ.923.41 కోట్ల వార్షిక ప్రణాళికలను ఆమోదించినా కేవలం రూ.28.84 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన పత్రాలు అందకపోవడమేనని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. తెరాస సభ్యుడు జి.రంజిత్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు.

సంక్షేమ పథకాలకు రూ.1,614 కోట్లు విడుదల

గత ఏడేళ్లలో ఎస్సీ, ఓబీసీల సంక్షేమ పథకాల కింద తెలంగాణకు రూ.1,614.24 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు. లోక్‌సభలో ఎంపీ బండి సంజయ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మంత్రి సమాధానం ప్రకారం 2018-19, 2019-20 సంవత్సరాల్లో పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కింద ఎస్సీ విద్యార్థులకు పైసాకూడా ఇవ్వలేదు.

పీఎం కిసాన్‌లో 96 వేల లావాదేవీలు ఫెయిల్‌

పీఎం కిసాన్‌ నిధుల విడుదలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు తెలంగాణలో 96,467 లావాదేవీలు విఫలమయ్యాయని కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లోక్‌సభలో వెల్లడించారు. దానివల్ల రూ.19.29 కోట్ల లావాదేవీలు ఆగిపోయాయని మళ్లీ ప్రయత్నించడంతో 3,536 లావాదేవీలు విజయవంతమయ్యాయని, రూ.70.72 లక్షలు చెల్లించగలిగినట్లు తెలిపారు.

డిస్కంల బకాయిలు రూ.4,367 కోట్లు

తెలంగాణ డిస్కంలు విద్యుత్తు ఉత్పత్తిదారులకు రూ.4,367 కోట్ల బకాయి ఉన్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ఆయన ఈ సమాధానం ఇచ్చారు. డిస్కంలకు ఆర్థిక లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లిక్విడిటీ ఇన్‌ఫ్యూజన్‌ స్కీం కింద కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల ద్వారా తెలంగాణకు రూ.12,652 కోట్ల రుణం మంజూరు చేసి రూ.12,576 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.

మేడారం జాతరపై ప్రతిపాదన రాలేదు

మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం రాజ్యసభలో తెరాస ఎంపీ కేఆర్‌ సురేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చాలని 2014లోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రానికి విజ్ఞాపన అందిందన్నారు. జులై 16 నుంచి 31 వరకు చైనాలో జరిగిన యునెస్కో సమావేశంలో రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కేంద్రాల జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి :పార్లమెంట్ సమావేశాలకు నేడే ముగింపు!

ABOUT THE AUTHOR

...view details