ఆషాఢమాస బోనాల పండుగ (Bonalu Festival)తో భాగ్యనగరం కోలాహలంగా మారింది. కరోనా వల్ల గతేడాది నిలిచిపోయిన ఉత్సవాలను ఈ ఏడు పటిష్ఠ నిబంధనలతో రెట్టింపు ఉత్సాహంతో జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజైన నేడు.. గోల్కొండ జగదాంబ అమ్మవారికి ఆలయ కమిటీ బంగారు బోనం సమర్పించింది. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
గోల్కొండ నుంచి బోనాలు(Bonalu Festival)ప్రారంభించడం ఆనవాయితీ. లష్కర్ బోనాల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తారు. వేడుకల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గతేడు నిరుత్సాహ పడిన భక్తులు ఆనందించేలా ఈ ఏడు పటిష్ఠ నిబంధనల మధ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ పండుగలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి.- ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
ఎంతో సంతోషదాయకమైన సందర్భం ఇది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించుకున్నాం. గోల్కొండ నుంచి మొదటి బోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించాం. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నగరంలోని ప్రతి ఆలయానికి నిధులు కేటాయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలి. ఈనెల 25న ఉజ్జయిని బోనాలు నిర్వహిస్తాం. అన్ని శాఖల సమన్వయంతో బోనాలు జరుపుకుంటున్నాం. - తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి