Private Schools Fee : తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పెంపు ఏటా 10 శాతానికి మించరాదని మంత్రుల కమిటీ తీర్మానించింది. ‘గత ఏడాది వసూలు చేసిన ఫీజుపై 10 శాతం లోపు రుసుం పెంచుకోవచ్చు. దాన్ని పాఠశాలస్థాయి ఫీజుల కమిటీనే నిర్ణయించుకోవచ్చు’ అని పేర్కొంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంపై విధివిధానాల రూపకల్పనకు 11 మంది మంత్రులతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఈ నెల 2న సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ సమావేశం తీర్మానాల కాపీ ఆదివారం బయటకు వచ్చింది. కమిటీ తీర్మానాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించాక కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఫీజు నిర్ణయానికి రెండు కమిటీలు
Private Schools Fee Hike : ఫీజులపై నిర్ణయానికి పాఠశాల స్థాయిలో ఒకటి, రాష్ట్ర స్థాయిలో మరొక కమిటీ ఉంటాయి. పాఠశాల స్థాయి కమిటీకి ఛైర్‌పర్సన్‌గా యాజమాన్యం నియమించిన ప్రతినిధి ఉంటారు. ప్రధానోపాధ్యాయుడు/ప్రధానోపాధ్యాయిని కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఆ పాఠశాలలో పనిచేసే ముగ్గురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అయిదుగురు సభ్యులుగా ఉంటారు. వారంతా కలిసి ఫీజు ఎంత పెంచాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. వారు నిర్ణయం తీసుకోలేకపోయినా? అభిప్రాయభేదాలు తలెత్తినా రాష్ట్రస్థాయి ఫీజుల కమిటీకి ప్రతిపాదించాలి. ఆ కమిటీకి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఛైర్‌పర్సన్‌గా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ప్రభుత్వం నియమించే విద్యావేత్త సభ్యులుగా ఉంటారు.