KTR khammam tour : ఖమ్మం నగరాన్ని నంబర్ వన్‌గా మార్చాలనేదే మంత్రి పువ్వాడ అజయ్ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి మరో కార్పొరేషన్‌లో జరగడం లేదని.. ఇక్కడి అభివృద్ధి ఇతర కార్పొరేషన్లకు ఆదర్శం కావాలన్నారు. ఖమ్మం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్.. రూ.11.75 కోట్లతో లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన, చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటైన్, రఘునాథపాలెంలో రూ.2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని కేటీఆర్ ప్రారంభించారు. కేసీఆర్ అంటేనే నిలువెత్తు అభివృద్ధి అని.. కే అంటే కాలువలు.. సీ అంటే చెరువులు.. ఆర్ అంటే రిజర్వాయర్‌లు అని అభివర్ణించారు.
KTR khammam tour Updates : ‘‘గత ప్రభుత్వాల హయాంలో జిల్లాలోని లకారం చెరువును మురికి కూపంగా మార్చారు. తెరాస వచ్చిన తర్వాత చెరువును ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం. చెరువుపై నిర్మించిన తీగల వంతెనను చూసేందుకు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. మంచి పనులు జరిగేటప్పుడు, అభివృద్ధి, సంక్షేమం విషయంలో వేలెత్తి చూపించేందుకు వీల్లేకుండా పనులు చేస్తుంటే సహజంగానే కొంత మంది విమర్శలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తుంటారు. అలాంటి ఒక కార్యక్రమాన్ని ఖమ్మంలో చేపట్టి ఒక నేతను రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. అంతటితో ఆగకుండా బట్ట కాల్చి మీదేసినట్లు ఆ నేత చావుకు మంత్రి పువ్వాడను బాధ్యుడిని చేసేందుకు ప్రయత్నించారు." -- కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి