Telangana Letter to Godavari Board: గోదావరిపై ఉన్న పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖరాశారు. పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు ఇదివరకే నిర్ణయం జరిగిందని.. అందుకు విరుద్ధంగా ఉపసంఘం సభ్యులెవరికీ సమాచారం లేకుండా బోర్డు అధికారులు ఇతర ప్రాజెక్టులను సందర్శించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సంప్రదాయాలకు విరుద్ధమన్న తెలంగాణ.. బోర్డు, ఉపసంఘం అనుమతి లేకుండా ఆ ప్రాజెక్టుల స్వాధీనం కోసం నివేదిక తయారు చేయడం తగదన్నారు.
బోర్డు, ఉపసంఘం నిర్ణయాలకు అనుగుణంగానే బోర్డు కార్యాలయం పనిచేయాల్సి ఉంటుందన్న తెలంగాణ.. బోర్టు నిర్ణయాలకు సంబంధం లేకుండా వెళ్లిన అధికారుల అభిప్రాయాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో పెద్దవాగు ప్రాజెక్టు మినహా తెలంగాణకు మాత్రమే నీరిచ్చే ఇతర ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని మరోమారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాజెక్టుల స్వాధీనం (Telangana irrigation projects) కోసం నివేదికల తయారీలో భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో జీఆర్ఎంబీ పర్యటన..
కేంద్రం గెజిట్‌కు (central gazette notification) అనుగుణంగా ప్రాజెక్టులను నదీ యాజమాన్య బోర్డులకు స్వాధీనం చేయాలన్న ప్రతిపాదనల పలు ప్రాజెక్టులను జీఆర్ఎంబీ బృందం ఇటీవల పరీశీలించింది. బోర్డు ఛైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం సంగారెడ్డి, నిజామాబాద్‌లో ప్రాజెక్టులను పరిశీలించింది. సింగూర్ జలశాయం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరీశీలించింది. అనంతరం నిజాంసాగర్, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల.. గరిష్ట వరద నిల్వ సామర్థ్యాలు, నిర్వహణ విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈనెల 17న ఐదో దఫా ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించారు. గెజిట్ షెడ్యూల్-2లో పేర్కొన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు అధికారులతో సమావేశం అయింది.