తెలంగాణ శాసనమండలిలో జూన్ నుంచి ఆరు ఖాళీలు కొనసాగుతున్నాయి (Telangana mlc polls under mla quota). అసెంబ్లీ కోటా నుంచి మండలికి గతంలో ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం జూన్ మూడో తేదీతో ముగిసింది. వాస్తవానికి ఆ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ రెండో వేవ్ కారణంగా అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. కరోనా నేపథ్యంలో నిర్దిష్ట గడవులోగా ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని, ఎప్పుడు నిర్వహించేది తదుపరి ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో ప్రకటించింది.
రాష్ట్రాల అభిప్రాయాలు సేకరణ..
కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం కొంత మేర తగ్గిన తర్వాత... ఎన్నికల నిర్వహణ విషయమై ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ఈసీ కోరింది. కరోనా పాజిటివ్ కేసులు బాగానే నమోదవుతున్న దృష్ట్యా.. ఎన్నికలు ఇపుడే నిర్వహించవద్దని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నవంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది (Telangana mlc polls under mla quota). ఆ తర్వాత హుజూరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఉపఎన్నికల విషయమై కూడా రాష్ట్రాలను కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాలు తీసుకొంది. రెండు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు సానుకూలంగా లేకపోవడంతో కొంత సమయం తీసుకొని ఈసీ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
వచ్చే నెలలోనే ఎన్నికలు..!
ప్రస్తుతం ఉపఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. లక్షల మంది ఓటర్లు పాల్గొనే ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని అంటున్నారు (Telangana mlc polls under mla quota). కేవలం శాసనసభ్యులు ఓటు వేసే ఎన్నికలు అయినందున ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని.. ఎన్నికలు నిర్వహించవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో మండలి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావచ్చని అంటున్నారు.