ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MINISTER HARISH RAO: 'జీఎస్‌డీపీ వృద్ధిలో తెలంగాణ ముందంజ' - telangana ministers news

దేశంలో తెలంగాణ పనితీరును అంచనా వేయడానికి, ఇతర రాష్ట్రాల పనితీరుతో పోల్చి చూడటానికి ఇది సరైన సమయమని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుదల స్థిరంగా ప్రతి సంవత్సరం జాతీయ జీడీపీ పెరుగుదల కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.

telangana-leads-in-gdp-growth-siad-finance-minister-harish-rao
'జీఎస్‌డీపీ వృద్ధిలో తెలంగాణ ముందంజ'

By

Published : Sep 8, 2021, 8:52 AM IST

తెలంగాణ 2014లో ఏర్పడిన కొత్త రాష్ట్రం. ఎండిన పంటలు, బీడు పడిన భూములు, ఆదాయం లేనిదని, విశ్వసనీయతను కోల్పోయి కుంటుపడిన వ్యవసాయం, కరవు పీడిత దుర్భిక్ష ప్రాంతాలు, తీవ్రమైన విద్యుత్‌ కొరతతో నీరసించిన పరిశ్రమలు నాడు రాష్ట్రంలో కనిపించేవి. అప్పటి పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలను అత్యంత వెనకబడిన జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కొత్త రాష్ట్రం ప్రజల శ్రేయస్సు కోసం కష్టతరమైన ప్రయాణం ప్రారంభించింది. అసమానతలు, అన్యాయాలు, నీళ్లు లేక, నిధులు లేక, ఉమ్మడి రాష్ట్రంలో నెరవేరకుండా మిగిలిపోయిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమనే సవాలును కొత్త ప్రభుత్వం స్వీకరించింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపై చింతించకుండా కె.చంద్రశేఖర్‌రావు పటిష్ఠమైన నాయకత్వంలో ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ’ను స్థాపించడానికి అనేక రకాల వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2020-21 కోసం రాష్ట్రాలవారీగా జీఎస్‌డీపీ డేటాను విడుదల చేసింది. దేశంలో తెలంగాణ పనితీరును అంచనా వేయడానికి, ఇతర రాష్ట్రాల పనితీరుతో పోల్చి చూడటానికి ఇది సరైన సమయం.

స్థిరంగా పెరుగుదల

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుదల స్థిరంగా ప్రతి సంవత్సరం జాతీయ జీడీపీ పెరుగుదల కంటే ఎక్కువగా ఉంది. 2018-19 సంవత్సరంలో తెలంగాణలో జీఎస్‌డీపీ వృద్ధి 14.7శాతంగా ఉండి, జీడీపీ వృద్ధిని 4.2శాతం మేర అధిగమించింది. కరోనా మహమ్మారి ప్రభావిత సంవత్సరం 2020-21లోనూ తెలంగాణ రాష్ట్రం జీఎస్‌డీపీలో 2.4శాతం సానుకూల వృద్ధిని సాధించింది. మరోవైపు జాతీయ స్థాయిలో చూస్తే, జీడీపీ మూడు శాతం క్షీణించింది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో, 2015-16 నుంచి 2020-21 వరకు 11.7శాతం సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో జీఎస్‌డీపీ నిరంతరం పెరుగుతూ తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే అధికంగా పెరగడానికి దోహద పడింది. 2020-21లో కొవిడ్‌ మహమ్మారివల్ల ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో 1.8శాతం వృద్ధిని సాధించగలిగింది. ఇదే సంవత్సరానికి జాతీయ తలసరి ఆదాయం నాలుగు శాతం క్షీణించిన పరిస్థితితో పోలిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ వృద్ధి ప్రశంసనీయమని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో పదో స్థానంలో ఉంది. 2020-21లో మూడో స్థానానికి ఎదిగింది. కేంద్ర ప్రభుత్వం 18 రాష్ట్రాలకు గాను విడుదల చేసిన డేటా ఈ వాస్తవాన్ని తేటతెల్లం చేస్తోంది.

తెలంగాణ ఆర్థిక ప్రగతికి వ్యవసాయ రంగ ప్రగతి ఎంతో దోహదపడుతోంది. వ్యవసాయం, పశుసంపద, చేపలు పట్టడం, అటవీ, మైనింగ్‌, క్వారీలను ప్రాథమిక రంగంగా పరిగణిస్తారు. జీఎస్‌డీపీలో దాని వాటా 2014-15లో 19.5శాతం నుంచి 2020-21లో 24.1శాతానికి మెరుగుపడింది. జనాభాలో దాదాపు 54శాతం ఈ రంగంపై ఆధారపడి ఉన్నందువల్ల, ఉపాధిపరంగా ఇది ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ రంగంలో 2020-21లో 16.5శాతం వృద్ధి 2014-15 కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. 2015-16 నుంచి తెలంగాణలో ప్రాథమిక రంగం సగటు వృద్ధి దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోకి అధికం. తెలంగాణ వ్యవసాయ రంగ వృద్ధి భారతదేశ వృద్ధి కంటే 8.5శాతం ఎక్కువ. 2014-15, 2020-21 మధ్య, పంట ఉత్పత్తి స్థూల విలువ రూ.41,706 కోట్ల నుంచి రూ.80,574 కోట్లకు, పశుసంపద రూ.29,282 కోట్ల నుంచి రూ.94,211 కోట్లకు, ఫిషింగ్‌-ఆక్వాకల్చర్‌ రూ.2,670 కోట్ల నుంచి రూ.5,254 కోట్లకు పెరిగింది. ఇది స్థిర సంకల్పంతో, దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితమే. నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృఢ చిత్తంతో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ‘కాళేశ్వరం’ను చేపట్టింది. చెరువుల పునరుద్ధరణ, పలు నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడంవల్ల పంట చేలకు సాగు నీరు అందివ్వడమే కాక, మత్స్య రంగంలో ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడింది. రైతులకు పెట్టుబడి మద్దతు పథకంగా రైతుబంధును చేపట్టింది. సబ్సిడీ గొర్రెలు, గేదెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, విజయ డైరీకి విక్రయించే పాలపై లీటరుకు నాలుగు రూపాయల ప్రోత్సాహం అందించడం వంటివి వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి దోహదపడ్డాయి.

పారిశ్రామిక రంగంలో, తయారీ విభాగం నుంచి 2014-15లో స్థూల ఉత్పత్తి విలువ రూ.54,533 కోట్లు కాగా 2020-21లో రూ.94,021 కోట్లకు పెరిగింది. విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల నుంచి రూ.7,340 కోట్ల నుంచి అదే కాలంలో రెట్టింపై రూ.16,871 కోట్లకు చేరింది. పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానం, టీఎస్‌-ఐపాస్‌ (2014)వల్ల తయారీ రంగానికి ప్రోత్సాహం లభించింది. పరిశ్రమల స్థాపనకు స్వీయ ధ్రువీకరణ, నిర్ణీత సమయంలో ప్రభుత్వ ఆమోదం పరిశ్రమల స్థాపనను సులభతరం చేసింది. భూమి లభ్యత, నిరంతర విద్యుత్‌ సరఫరా, అదనపు వసతుల కల్పన పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడింది. ఇప్పటివరకు 15,852 పారిశ్రామిక యూనిట్లు రూ.2,14,951 కోట్ల పెట్టుబడితో ప్రభుత్వ ఆమోదం పొందాయి. వీటివల్ల 15.60 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో సేవల రంగం జీఎస్‌డీపీలో దాదాపు 60శాతం వాటా అందించే అతి ముఖ్యమైనది. 34.7శాతం ఉత్పత్తి విలువను అందించే కీలకమైన ఉపరంగం ఇది. రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు 2014-15లో రూ.66,276 కోట్లు కాగా 2020-21లో రూ.1,45,522 కోట్లకు పెరిగాయి. వీటిలో సగటు వార్షిక వృద్ధి 14శాతం. వాణిజ్యం, రిపేర్లు, హోటళ్లు, రెస్టారెంట్ల సేవల స్థూల విలువ 2014-15 నుంచి 2020-21 మధ్య రూ.64,269 కోట్ల నుంచి రెట్టింపై రూ.1,36,514 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ఆర్థిక పటిష్ఠతను కాపాడుకోవడంలో తెలంగాణ దృఢ సంకల్పంతో ఉంది. రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో సంవత్సరానికి సగటున 11.5శాతం వృద్ధిరేటుతో 2014-15 నుంచి 2020-21 వరకు దేశంలో అగ్రగామిగా నిలిచింది. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 2014-15లో రూ.35,146 కోట్ల నుంచి 2020-21లో రూ.66,648 కోట్లకు (90శాతం పెరుగుదల) వృద్ధిని నమోదు చేసింది. అసాధారణ ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ దీన్ని సాధ్యం చేయడం సాధారణ విషయం కాదు. ప్రజల ఆదాయాలను మెరుగుపరచడం, వారి కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా మాత్రమే ఇది వీలయింది.

ప్రగతికాముక రాష్ట్రం

త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొమ్మిది శాతం సగటు వార్షిక వృద్ధిరేటును నమోదు చేసిందని, ‘అర్థ్‌ నీతి’ తాజా సంచికలో నీతిఆయోగ్‌ పునరుద్ఘాటించింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థలు అయిన గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఐబీఎమ్‌ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి వన్నె తెచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో, పటిష్ఠమైన ప్రణాళికతో, నిరంతర తపనతో సామాజిక ఆర్థిక రంగాలన్నింటిలో రాష్ట్రం పురోగమిస్తోంది. బంగారు తెలంగాణ నిర్మాణానికై ముఖ్యమంత్రి కలలు కన్న ప్రగతిని ఒక్కో రంగంలో చవిచూస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమాలను ఒకదానికొకటి ఆలంబనగా చేసి, తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత ఆయనది. ఆ శ్రమ ఫలితంగానే తెలంగాణ దేశంలోనే ప్రగతికాముక రాష్ట్రంగా అవతరించింది.

(తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా రచయిత వ్యక్తపరచిన అభిప్రాయాలివి)

ఇదీ చూడండి:RAINS : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... మునిగిన ఏజెన్సీ..

ABOUT THE AUTHOR

...view details