తనపై అకారణంగా డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారని.. తనకు డ్రగ్స్ కేసుకు ఏం సంబంధమని తెలంగాణలోని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను అన్ని డ్రగ్స్ అనాలసిస్ పరీక్షలకు సిద్దమని.. మరి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ కూడా సిద్ధమేనా అని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దిల్లీ పార్టీలకు సిల్లీ పాలిటిక్స్ మాత్రమే తెలుసు అని.. తెలంగాణ ప్రజలకు కావాల్సింది మాత్రం తెలియదన్నారు. అధికారంలో ఉన్న తెరాస పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు పని లేక ఒకరు పాదయాత్ర చేస్తున్నారని.. మరొకరు తాను ఉన్నానని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
ఓట్లు చీల్చడానికే కొత్త పార్టీలు..
తెలంగాణ సాయుధ పోరాటంలో భాజపా, జనసంఘ్ ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కమ్యూనిస్టుల పోరాటాన్ని తమ పోరాటంగా భాజపా చెప్పుకుంటుందన్నారు. భాజపా నాయకులు చరిత్రకు మతం రంగు పూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు.. ఏదో ఒక జాతీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు. తెరాస పార్టీ ఓట్లను చీల్చడం కోసమే కొత్త పార్టీలు వస్తున్నాయని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో కేసీఆర్‌ను పొగిడారని.. ఇప్పుడేమో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలు రాకపోతే.. అదే ప్రవీణ్ కుమార్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదని అన్నారు. షర్మిల కూడా అలాగే వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ విమర్శించారు.
రాజదోహ్రం కేసులు కూడా పెడతాం..
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస కచ్చితంగా గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ నేత జానారెడ్డిని ఓ చిన్న పిల్లాడు ఓడించారన్నారని గుర్తుచేసుకున్నారు. ఈటల రాజేందర్ జానారెడ్డి కంటే గొప్పవాడా అని అన్నారు. ప్రజలకు తెరాసపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పారు. గజ్వేల్ లోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చని తెలిపారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు వస్తాయా..? అని ఎద్దేవా చేశారు. ఇక నుంచి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని..కేసులు పెడుతామన్నారు. అవసరం అయితే రాజద్రోహం కేసులు కూడా పెడుతామని హెచ్చరించారు. అడ్రస్ లేని వ్యక్తులు సీఎం కేసీఆర్‌ను తిడితే ఊరుకోమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోరా?
ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి ఇవాళ కన్నాలు వేస్తున్నట్లు బయట ప్రచారం జరుగుతోందన్నారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇళ్లు ఎట్లా వచ్చాయని ఆరోపించారు. పీసీసీ అధ్యక్ష పదవిని రూ.50కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని...ఆ పార్టీ నేతలే అంటున్నారని కేటీఆర్ చెప్పారు. ఇవాళ పీసీసీ కొనుక్కున్నోడు.. రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోడా అని ఆరోపించారు.
దళితులకు ఇలాంటి పథకాలు ఎప్పుడైనా ఇచ్చారా?
కొత్తగా పుట్టుకొచ్చిన కొన్ని పార్టీలు ఎందుకు పుట్టాయో ప్రజలకు తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త పార్టీలు కేసీఆర్ మీద మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నాయి.. జాతీయ పార్టీల పై ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. కేంద్రం మెడికల్ కాలేజీలు.. విద్యాలయాలు.. ఇవ్వకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్, భాజపాపై షర్మిల- ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెరాస ఓటును చీల్చడానికే షర్మిల, ప్రవీణ్ కుమార్ పార్టీలు ఉద్భవించాయని ఆరోపించారు. కాంగ్రెస్ 60 ఏళ్ల రాజకీయ పాలనలో దళితులకు దళితబంధు పథకం లాంటిది ఎప్పుడైనా పెట్టారా అని ధ్వజమెత్తారు.