TS Intermediate Pass Percentage 2021 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 60.01 కాగా ఈ ఏడాది 11 శాతం తగ్గింది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాలను ఇంటర్‌బోర్డు గురువారం వెల్లడించింది. మొత్తం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్, ఒకేషనల్... రెండింటిలోనూ ఉత్తీర్ణత శాతం సమానంగా రావడం గమనార్హం.
పరీక్షలపై అస్పష్టతే కారణం!
Telangana Intermediate Pass Percentage 2021 : గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి పరీక్షలపై అస్పష్టతే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2020-21 విద్యా సంవత్సరంలో నెలన్నర తప్ప మిగిలిన రోజుల్లో ఆన్లైన్ తరగతులే జరిగాయి. గత ఏడాదికి సంబంధించి మే నెలలో పరీక్షలు జరగాల్సి ఉండగా.. కరోనా రెండో వేవ్ కారణంగా విద్యార్థులను రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేశారు. భవిష్యత్తు పరిస్థితులను బట్టి తొలి ఏడాది విద్యార్థులకు పరీక్షలు జరుపుతామని గత ఏప్రిల్‌లో ప్రభుత్వం ప్రకటించింది. దాంతో విద్యార్థులు పరీక్షలు ఉండనట్లేనని భావించి చదువుకు దూరమయ్యారు. పరీక్షలు ఉంటాయన్న స్పష్టత ఇవ్వకుండా విద్యాశాఖ అక్టోబరు 27 నుంచి నిర్వహించింది. అప్పటికే రెండో ఏడాది చదువులో నిమగ్నమైన విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితంగా భారీగా ఉత్తీర్ణత శాతం పడిపోయింది.
తప్పులుంటే 31లోగా ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లాలి
Telangana Intermediate Results 2021 : పునఃలెక్కింపు, పునఃమూల్యాంకనం కోసం ఈనెల 22వ తేదీలోపు ఇంటర్‌బోర్డు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తిరిగి లెక్కింపు కోసం సబ్జెక్టుకు రూ.100, పునఃమూల్యాంకనానికి రూ.600 చొప్పున ఫీజు చెల్లించాలి. పునః లెక్కింపు అంటే మార్కుల కూడికలో తేడాలుంటే పరిశీలిస్తారు. పునఃమూల్యాంకనంలో సబ్జెక్టు నిపుణుడితో మరోసారి మూల్యాంకనం చేయిస్తారు. విద్యార్థుల జవాబుపత్రం స్కానింగ్ కాపీని పంపిస్తారు. ఆ పత్రాలను ఇంటర్‌బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్కుల మెమోల్లో తప్పులుంటే విద్యార్థులు వారి చదివే కళాశాలల ప్రిన్సిపాళ్ల దృష్టికి ఈనెల 31వ తేదీలోపు తీసుకువెళ్లాలని బోర్డు తెలిపింది. మార్కుల మెమోలను ఈ నెల 17న సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్లో ఉంచుతామని పేర్కొంది.
మేడ్చల్‌లో అత్యధికం.. మెదక్‌లో అత్యల్పం
Intermediate First Year Pass Percentage 2021 : ఈసారి మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 63 శాతం ఉత్తీర్ణత దక్కింది. ఆ తర్వాత ములుగు జిల్లాలో 61 శాతం మంది పాసయ్యారు. అత్యల్పంగా మెదక్ జిల్లాలో 22 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు.