తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. ఇంటర్ పరీక్షలుపై మంగళవారం కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. కేబినెట్ భేటీ తర్వాత దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బుధవారం సాయంత్రం ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు.
ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. మార్కుల కేటాయింపుపై త్వరలో కమిటీ ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందిస్తామన్నారు. కమిటీ నిర్ణయం ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. పరీక్షలు రాయాలనుకునే వారు పరిస్థితులు చక్కబడ్డాక రాయొచ్చని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.