ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Justice NV Ramana: న్యాయ వ్యవస్థ పటిష్ఠానికి...ఆ రెండు విషయాలు కీలకం..! - CJI Justice NV Ramana news

CJI Justice NV Ramana: దేశంలో న్యాయ వ్యవస్థ పటిష్ఠానికి కోర్టులు సామాన్యుడికి అందుబాటులో ఉండటం.. అందులో మౌలిక వసతులు ఉండటం.. ఈ రెండు విషయాలు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఇందుకోసం తన సాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే సంతోషించేవాడిలో తానూ ఒకడినంటూ స్పష్టం చేశారు.

CJI Justice NV Ramana
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

By

Published : Apr 16, 2022, 10:40 AM IST

CJI Justice NV Ramana: న్యాయవ్యవస్థలో జడ్జీల ఖాళీలు భర్తీ చేసి మౌలిక వసతులు కల్పిస్తేనే అందరికీ న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల కొరత వల్ల ఒక్కసారి కోర్టుకు వెళితే తీర్పు రావడానికి ఎన్నేళ్లు పడుతుందనే ప్రశ్న ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా ఉండాలంటే ఖాళీల భర్తీకి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఒక్క ఖాళీ కూడా ఉంచకూడదన్నది తన లక్ష్యమని చెప్పారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ హాలులో న్యాయాధికారుల రెండు రోజుల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ఆరేళ్ల తరువాత ఈ సదస్సు జరుగుతోంది. న్యాయపరిపాలనపై ఆత్మపరిశీలనతోపాటు, గుణాత్మకమైన అభివృద్ధి, సబార్డినేట్‌ కోర్టుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడమే ఈ సమావేశం ఉద్దేశం. భారత న్యాయవ్యస్థను అత్యంత ప్రభావితం చేసే అంశం పెండెన్సీయే. సరైన మౌలిక వసతుల్లేకపోవడంతో మీరు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోగలను. దీని పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా. తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాం. మౌలిక సదుపాయాల కల్పన కోసం జాతీయ, రాష్ట్రస్థాయుల్లో చట్టబద్ధమైన సంస్థల ఏర్పాటుకు చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే. ఈ అంశాలపై చర్చించడానికి ఈ నెలాఖరులో సీజేలు, సీఎంల సమావేశం నిర్వహించనున్నాం.’

న్యాయానికి చట్టం అడ్డంకి కాదు..
‘కక్షిదారులు సంతృప్తిగా వెళ్లేలా చూసుకోవాల్సింది మీరే. న్యాయాధికారుల ప్రవర్తన, వ్యవహారశైలి ఆధారంగా వ్యవస్థపై ప్రజలు ఓ అభిప్రాయానికి వస్తారు. వివాదంలో మానవీయ అంశాలను పరిశీలించాలి. న్యాయం చేయడానికి చట్టం అడ్డంకి కాదు. కక్షిదారుల ఆర్థికస్థితి, సామాజిక చరిత్ర, విద్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మైనర్లు, మహిళలు, బలహీనవర్గాలు, అంగవైకల్య వర్గాలకు ప్రాధాన్యమివ్వాలి. మీ ముందున్న ఆధారాలను పరిశీలించి విచక్షణతో నిర్ణయం తీసుకోండి. మారే చట్టాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల గురించి తెలుసుకోవాలి.’

పెండెన్సీ తగ్గించండి..
‘న్యాయాధికారులపై దాడుల నివారణకు వారికి రక్షణ పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మీ మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో గడపండి. ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడే అత్యుత్తమంగా పనిచేయగలరు. అందువల్ల ఈ సమస్యలను పే కమిషన్‌ దృష్టికి తీసుకెళతాను. త్వరలో శుభవార్త వింటారు. కొవిడ్‌ మహమ్మారి సమస్యల నుంచి బయటపడ్డాం. అదనపు గంటలు పనిచేసి పెండెన్సీని తగ్గించడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నా. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని (ఏడీఆర్‌) ప్రోత్సహించాలి. న్యాయాధికారుల సమస్యలను పరిష్కరించడానికి సీజేె సతీష్‌చంద్ర శర్మ ఉన్నారు. హైకోర్టులో మిగిలిన న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సిఫారసులు పంపాలని కోరుతున్నా’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు అభినందనీయం..
‘కేసీఆర్‌ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు పూర్తి సహకారం అందిస్తోంది. పోస్టుల భర్తీలో కూడా రాష్ట్రం ముందుంది. సీఎం కేసీఆర్‌ది ఎముక లేని చేయి. న్యాయవ్యవస్థపై ఆయన కురిపించిన వరాల జల్లు ఇందుకు నిదర్శనం’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులను ఎలా తగ్గించాలా అని చూస్తుంటాయని.. అలాంటిది తెలంగాణలో 4350కి పైగా పోస్టులు మంజూరు చేయడం విశేషం అన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం (ఐఏఎంసీ) ఏర్పాటు కలను సాకారం చేశారన్నారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇలాంటివి ఏర్పాటు చేయాలని కోరుతున్నాయని, ఇది బలోపేతమయ్యాక దీని శాఖలను విస్తరిస్తామని చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ప్రారంభోపన్యాసంలో- న్యాయమూర్తుల సంఖ్యను పెంచిన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో కోర్టులో సగటున రెండు వేల చొప్పున కింది కోర్టుల్లో 8 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. న్యాయాధికారులు సమయపాలన పాటించడంలేదని తెలుస్తోందని, దీన్ని సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. ఈ సదస్సులో అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. వికారమంజిల్‌లో న్యాయమూర్తుల అతిథి గృహం, హైకోర్టులో రికార్డు బ్లాక్‌ ప్రతిపాదిత నిర్మాణాల శిలాఫలకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సీజేఐ, సీఎం తదితరులను న్యాయాధికారుల సంఘం సన్మానించింది. ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి యామినీరెడ్డి తన బృందంతో గణపతి ప్రార్థనతో చేసిన నృత్యప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభమైంది.

ఇవీ చూడండి:Kolleru lands: కొల్లేరు భూముల్లో అక్రమ తవ్వకాలపై పరిశీలన..

ABOUT THE AUTHOR

...view details