ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jagan Case: జగన్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏంటంటే..! - తెలంగాణ హైకోర్టు

Jagan case: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో మొదట సీబీఐ ఛార్జ్ షీట్లనే తేల్చాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ ఛార్జ్ షీట్లపై తీర్పు వెల్లడయిన తర్వాతే.. ఈడీ కేసుల విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఒకవేళ రెండూ సమాంతరంగా విచారణ జరిపినప్పటికీ... సీబీఐ కేసులు తేలే వరకూ ఈడీ కేసులపై తీర్పు వెల్లడించరాదని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

telangana high court
telangana high court

By

Published : Sep 8, 2022, 10:27 PM IST

Updated : Sep 9, 2022, 7:15 AM IST

Jagan Case: ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ కేసులో తీర్పు వెలువరించిన తర్వాతే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఒకవేళ సీబీఐ కేసుతో సమాంతరంగా విచారణ చేపట్టినప్పటికీ తీర్పు ప్రకటనను నిలిపి ఉంచాలని తెలిపింది. సీబీఐ కేసులో తీర్పు వెలువడ్డాక దాని ఫలితం ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రధానమైన సీబీఐ కేసును కొట్టివేసిన పక్షంలో ఈడీ కేసు ఉండదని వివరించింది. సీబీఐ కేసుతో సంబంధం లేకుండా ఈడీ కేసు విచారణ చేపట్టవచ్చంటూ గత ఏడాది జనవరిలో సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.

సీబీఐ కేసుతో సంబంధంలేకుండా ఈడీ కేసు విచారణ చేపట్టవచ్చంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అక్రమాస్తుల కేసులో నిందితులైన పార్లమెంటు సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌, భారతీ సిమెంట్స్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన 10 పిటిషన్‌లపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ గురువారం తీర్పు వెలువరించారు. ‘విజయ్‌ మదన్‌లాల్‌ చౌదరి కేసులో.. ఈడీ కేసుకు మూలం సీబీఐ కేసులో పొందిన అక్రమ ప్రయోజనమే. సీబీఐ కేసును సంబంధిత కోర్టు కొట్టివేసిన పక్షంలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసే ఉండదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పునకు అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లు కట్టుబడి ఉండాల్సిందే.

చట్టంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో అన్ని కోర్టులు దీన్ని అమలు చేయాల్సిందే’ అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. గతంలో ఇదే వివాదానికి సంబంధించి విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లను కొట్టివేస్తూ గత ఏడాది ఆగస్టులో సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారని, ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో దాన్ని అనుసరించాల్సిందేనని పేర్కొన్నారు. సీబీఐ కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ఈడీ కేసు దర్యాప్తు, విచారణ కొనసాగించవచ్చన్నారు. సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చినందున.. సీబీఐ కేసు నేపథ్యంలో నేరపూరిత సొమ్ము ఉన్నప్పుడు ఈడీ కేసు ఉంటుందని, సీబీఐ కేసును కొట్టివేసిన పక్షంలో నేరపూరిత సొమ్మే ఉండదని, అలాంటప్పుడు ఈడీ కేసుకు ఆస్కారం లేదన్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ విజయసాయిరెడ్డి, జగతి పిటిషన్‌లను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 9, 2022, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details