తెలంగాణ మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటల్లో ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ భూముల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసి తగిన గడువు ఇచ్చి, చట్ట ప్రకారం చర్యలు చేపట్టవచ్చని పేర్కొంది. సేల్స్ ట్యాక్స్ అధికారుల్లా ఈరోజు నోటీసులిచ్చి రేపు వెళతామంటే కుదరదని, తగినంత గడువు ఇచ్చి వివరణ కోరాలని స్పష్టంచేసింది. నోటీసులకు స్పందించకపోతే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఇందులో కలెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రభావం ఉండరాదని పేర్కొంది. భూముల్లోకి సర్వే పేరుతో కలెక్టర్ వెళ్లడాన్ని తప్పుబట్టింది. విచారణకు వెళ్లే ముందు నోటీసులు ఇవ్వకపోవడం సహజ న్యాయసూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని కోర్టు అభిప్రాయపడింది. అలా చట్టవిరుద్దంగా ప్రవేశించడాన్ని తప్పుబట్టిన కోర్టు పిటిషనర్ల హక్కుల్లో జోక్యం చేసుకోరాదని, కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జులై 6కు వాయిదా వేసింది.
హౌస్‌మోషన్ పిటిషన్
నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లోకి రావడాన్ని సవాలు చేస్తూ జమునా హేచరిస్, ఈటల నితిన్‌రెడ్డి, ఈటల జమున హైకోర్టులో అత్యవసరంగా హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్‌కుమార్ ఇంటివద్ద విచారణ చేపట్టారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తి పలు ప్రశ్నలను సంధిస్తూ అధికారులు వ్యవహరించిన తీరును హర్షించలేకపోతున్నానని పేర్కొన్నారు. సర్వేకు అనుసరించిన విధానం ఏమిటని ప్రశ్నించారు. నివేదికలో కలెక్టర్ వాడిన భాషను చూస్తే ఏ రకంగా వ్యవహరించారో తెలుస్తోందన్నారు. ఏజీ చెప్పినట్లు డిజిటల్ సర్వే అయినా కనీసం నోటీసులు ఇవ్వాల్సి ఉందని, ఇంత హడావుడి ఎందుకని ప్రశ్నించారు. కలెక్టర్ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఏ అధికారంతో విచారణ చేపట్టారో తరువాత తేలుస్తామని వ్యాఖ్యానించారు. ఎసైన్డ్ భూముల ఆక్రమణలపై చట్టప్రకారం చర్యలు చేపట్టడాన్ని తప్పుబట్టబోమని, అయితే ఇక్కడ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
పోలీసు బలగాలతో చొచ్చుకువచ్చారు
కలెక్టర్ 100 నుంచి 200 మందికిపైగా పోలీసు బలగాలతో హేచరీస్‌లోకి చొచ్చుకురావడం ఏమిటి? హేచరీస్‌లో శుభ్రత ముఖ్యం. లేకపోతే కోళ్లకు హాని జరుగుతుంది. అయితే అవేవీ పట్టించుకోలేదు. కనీసం ప్లాంట్ మేనేజర్, జనరల్ మేనేజర్లకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఉదయం సీఎస్ చెబితే సాయంత్రానికి కలెక్టర్ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికేంటో మాకు ఇవ్వనేలేదు. ఎసైన్డ్ భూములను ఆక్రమించారని టీవీల్లో ప్రసారం కావడం, వాటిపై ఫిర్యాదు అందడం, ముఖ్యమంత్రి సీఎస్‌కు చెప్పడం, సీఎస్ కలెక్టర్‌ను ఆదేశించడం.. ఉదయం 6 గంటలకే సర్వేకు వెళ్లడం.. రాత్రికల్లా నివేదిక ఇవ్వడం.. అన్నీ చకచకా జరిగిపోయాయంటే ఇది ముందస్తు ప్రణాళికే. ఇలాంటి వ్యవహారాన్ని ఇన్నేళ్లలో ఎప్పుడూ చూడలేదు. వాళ్లు చొచ్చుకు వచ్చిన తీరును ఫొటోల్లో చూడవచ్చు. సర్వే నంబరు 111లో 7 ఎకరాలను కొల్లి సీతారామారావు నుంచి కొన్నాం. సర్వే నంబరు 81లోను 9 ఎకరాలకుగాను 5.36 ఎకరాలు మా స్వాధీనంలో ఉన్నాయి. 130లోని 18 ఎకరాల్లో 3 ఎకరాలు పట్టా భూములు కొన్నాం. అవి ధరణిలోనూ నమోదై ఉన్నాయి. దురుద్దేశాలతోనే ఈ చర్యకు పాల్పడ్డారు. ఉదయం 6 గంటలకు ఎలాంటి నోటీసు లేకుండా దౌర్జన్యంగా చొరబడటం అరాచకం. అందుకే కోర్టును ఆశ్రయించాం. 121 ఎకరాల వివాదాస్పద భూమిలో 58 ఎకరాలు పట్టా భూమి అని వారే చెబుతున్నారు. 66 ఎకరాలు ఎసైన్డ్ భూమి అని అంటున్నారు. చట్టప్రకారం కోళ్ల ఫారం నిర్వహించడానికి భూమార్పిడి అవసరంలేదు. 12 ప్లస్ 3 షెడ్ల నిర్మాణానికి పంచాయతీ అనుమతులు తీసుకున్నాం. సర్వేకు వచ్చే ముందు కలెక్టర్ స్థాయి అధికారి నిబంధనలను పట్టించుకోలేదు. కలెక్టర్ రూపొందించిన నివేదికలో జమునను నితిన్‌రెడ్డి భార్యగా పేర్కొన్నారు. తల్లిని భార్యగా చెప్పారంటే వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా ఎంత హడావుడిగా నివేదిక ఇచ్చారో అర్థమవుతుంది.
-పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి