ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసమే అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేపట్టినట్లు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఎల్ఆర్ఎస్ను సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై... ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కౌంటరు దాఖలు చేశారు. కఠిన చట్టాలు లేకపోవడం వల్లనే అనధికార లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయని.. ప్రస్తుతం అవి అభివృద్ధి, సదుపాయాల కల్పనకు అడ్డంకిగా మారాయని సర్కారు పేర్కొంది. ప్రజలకు ఒక అవకాశం ఇచ్చి మార్పు తేవడంతోపాటు.. భవిష్యత్‌లో అనధికార లేఅవుట్లను నిరోధించే ఉద్దేశంతోనే ఎల్ఆర్ఎస్ను రూపొందించినట్లు కౌంటర్‌లో తెలిపింది. అనధికార లేఅవుట్లలో ఇకపై రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతులు ఉండబోవని స్పష్టం చేసింది. గతంలోనూ రెండు సార్లు క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చినట్లు తెలిపింది. అనధికార లేఅవుట్లను నిరోధించేందుకే రిజిస్ట్రేషన్లను నిలిపివేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక నుంచి డాక్యుమెంట్లతో పాటు లేఅవుట్ అనుమతి పత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్లు ఉంటాయని వివరించింది. క్రమబద్ధీకరణ కోసం 2015లో 3 లక్షల 80వేల దరఖాస్తులు రాగా.. సుమారు 2 లక్షల 80వేలు క్రమబద్ధీకరించినట్లు వివరించింది.
మౌలిక వసతుల కల్పన కోసమే..
ఎల్ఆర్ఎస్ ఛార్జీల ద్వారా వచ్చే సొమ్మును ప్రత్యేక ఖాతాలో జమ చేసి.. మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. అనధికార లేఅవుట్లపై గతంలో చర్యలు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొనడం సరికాదని.. గతేడాది 715 లేఅవుట్లపై హెచ్ఎండీఏ చర్యలు తీసుకుందని వివరించింది. రాష్ట్ర విభజన తర్వాతే అనధికార లేఅవుట్లు పెరిగాయనడం సరికాదని... సుమారు 90శాతం దరఖాస్తులు 2014కి ముందు లేఅవుట్లలోనివేనని స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్కు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని.. సుమారు 20 లక్షల 44వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది.