Jagan bail cancellation petition: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ తరఫున న్యాయవాది శ్రీ వెంకటేశ్ వాదనలు వినిపించారు. సీఎం హోదాలో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో జగన్‌కు నోటీసులు ఇవ్వాలని కోరారు. బెయిల్ రద్దు పిటిషన్‌పై వైఖరి ఏమిటని హైకోర్టు.. సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ కోర్టు తీర్పు తర్వాత పరిస్థితిలో ఏమీ మార్పు లేదని సీబీఐ తరపు న్యాయవాది బదులిచ్చారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
హైకోర్టులో రఘురామ పిటిషన్.. ఎందుకంటే..
MP Raghurama petition on Jagan bail cancellation: అక్రమాస్తుల కేసులో.. ముఖ్యమంత్రి జగన్తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ కోర్టు విధించిన షరతులు ఉల్లంఘించినందున జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.