TS High Court On Pubs: నివాస ప్రాంతాల్లో పబ్‌ల నియంత్రణపై ఏం చర్యలు తీసుకున్నారో రేపు తెలపాలని.. తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
ఇళ్ల మధ్య పబ్‌ల వల్ల శబ్ద కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో.. పబ్‌లు, బార్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొన్ని ప్రాంతాల్లో పదుల సంఖ్యలో పబ్‌లు, బార్లు ఉన్న విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది.
యువతను దృష్టిలో ఉంచుకొని పబ్‌లపై నియంత్రణ చర్యలు ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసి, జరిమానాలు విధిస్తే సరిపోతుందా? అని వ్యాఖ్యానించింది. పబ్‌లు, బార్లు పాటించాల్సిన మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేస్తామని.. కొంత సమయం ఇవ్వాలని అదనపు ఏజీ రామచంద్రరావు కోరారు. స్పందించిన న్యాయస్థానం.. నూతన సంవత్సర వేడుకల్లోపే ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను రేపు కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.