తెలంగాణ జల విద్యుత్తు కేంద్రాల్లో వంద శాతం ఉత్పత్తి చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవాలంటూ తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ సోమవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ముందుకు పంపాలని కోరగా జస్టిస్ రామచంద్రరావు ఇలాంటి అభ్యర్థనకు కారణమేమిటని ప్రశ్నించారు. ‘బెంచ్ హంటింగ్’ (అనుకూలమైన ఉత్తర్వులు పొందడానికి వీలుగా కావలసిన బెంచ్ ముందుకు కేసు వచ్చేలా చూడటం) ఎత్తుగడలను ఏజీ కార్యాలయం నుంచి ఊహించలేమని పేర్కొన్నారు.
పూర్తిస్థాయి జలవిద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన జీవో 34ను సవాలు చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు జి.శివరామకృష్ణప్రసాద్, ఎం.వెంకటప్పయ్యలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం ఉదయం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు ఈ పిటిషన్ విచారణ పరిధి ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనానికే ఉందంటూ అభ్యంతరపెట్టగా ధర్మాసనం మధ్యాహ్నం పరిశీలిస్తామంది. ఏఏజీ వెంటనే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావిస్తూ జల వివాదాలపై సీజే ధర్మాసనం విచారించాల్సి ఉండగా, జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం విచారణ చేపడుతోందన్నారు. తాము అభ్యంతరం వ్యక్తం చేసినా విచారణకు అనుమతించారనగా ఈ విషయాన్ని తిరిగి అక్కడే చెప్పాలంటూ సీజేతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అనంతరం రిజిస్ట్రీ నుంచి సమాచారం అందడంతో మధ్యాహ్నం జస్టిస్ రామచంద్రరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనికి ఏజీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసు విచారణ నుంచి తప్పుకొని, సీజే ధర్మాసనానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ సీజే పరిశీలించాకే రిజిస్ట్రీ ఇక్కడికి పంపారని, తిరిగి తామెలా పంపుతామని ప్రశ్నించింది. సరైన కారణం చెప్పకుండా తప్పుకోవాలనడం సరికాదంటూ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో 34 జారీ చేసిందన్నారు. సాగుకు వినియోగించాల్సిన నీటిని విద్యుదుత్పత్తికి వినియోగిస్తున్నారని, ఆ నీరు నిరుపయోగంగా సముద్రం పాలవుతోందన్నారు. గతంలో రాజోలిబండ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంతర్ రాష్ట్ర జల వివాదాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు జోక్యం చేసుకోలేవని ధర్మాసనం పేర్కొంది. సుప్రీం తీర్పుపై అధ్యయనం చేసి రావాలంటూ పిటిషనర్లతోపాటు ప్రతివాదుల తరఫున హాజరైన ఏజీ, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వరరావుకు సూచిస్తూ కేసును మంగళవారానికి వాయిదా వేసింది.
ఇదీ రాజోలిబండ కేసు
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి కోసం కర్ణాటక ప్రభుత్వం టెండర్లు పిలవగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నీటిని సాగు కోసం కేటాయించాలని, విద్యుదుత్పత్తికి వినియోగించరాదని అభ్యర్థించారు. నదీ జలాల నిర్వహణ, నీటి విడుదల తదితర అంతర్ రాష్ట్ర వివాదాల్లో సుప్రీం, హైకోర్టులు జోక్యం చేసుకోజాలవంటూ కొట్టివేసింది.
ఇదీ చదవండి: