ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో జప్తు చేసిన హెటిరో భూములను ఆ సంస్థకు అప్పగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా విశాఖ జిల్లా నక్కపల్లిలో హెటిరో సంస్థకు చెందిన 43 ఎకరాల భూమిని ఈడీ జప్తు చేసింది. హెటిరో పిటిషన్పై విచారణ జరిపిన దిల్లీలోని ఈడీ అప్పీలేట్ అథారిటీ.. 2018లో తీర్పు వెల్లడించింది. భూమి విలువకు సమానమైన రూ.5.6 కోట్లు డిపాజిట్ స్వీకరించి, భూములు అప్పగించాలని ఈడీ అప్పీలేట్ అథారిటీ ఆదేశించింది.
తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు....
అప్పీలేట్ అథారిటీ ఆదేశాల మేరకు హెటిరో కంపెనీ సొమ్ము డిపాజిట్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ... ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.