తగ్గిపోతుందిలే అనుకున్న మహమ్మారి మరోమారు తెలంగాణలో పంజా విసురుతోంది. పదిరోజుల కిందటి వరకు రాష్ట్రంలో రెండు వందలు దాటని కొవిడ్ కేసులు ఇప్పుడు ఏకంగా నాలుగు వందల పైకి చేరాయి. గడచిన 24 గంటల్లో 493 మంది మహమ్మారి బారిన పడినట్టు వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది కాలంలో ఒక రోజులో కరోనా సోకిన వారి సంఖ్య ఇదే గరిష్ఠం కావడం గమనార్హం.
తెలంగాణ @ 3,04,791
తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 3,04,791కి చేరింది. మరో 157 మంది కోలుకోగా ఇప్పటి వరకు 2,99,427 మంది కోలుకున్నారు. మరో నలుగురు వైరస్ బారిన పడి మృతి చెందగా.. మొత్తం మరణాలు 1,680కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,684 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా అందులో 1,616 మంది హోం ఐసోలేషన్‌లోనూ 2,068 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఆ వయస్సు వారిలోనే ఎక్కువ కేసులు
ఇక వైరస్ బారిన పడుతున్న వారిలో అత్యధికగా 21 నుంచి 30 ఏళ్ల మధ్య వారే ఉంటున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారిలో 23.66 శాతం మంది ఆ వయసువారే కాగా.. ఆ తర్వాత 31 నుంచి 40 ఏళ్ల వారు 23.04 శాతం మంది ఉన్నారు. 10 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్నవారిలో 9.03 శాతం మందికి వైరస్ సోకగా చిన్నారులపై కరోనా ప్రభావం తక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వారిలో చాలా వరకు లక్షణాలు ఉండకపోవడం వల్ల.. పిల్లల నుంచి ఇంట్లోని పెద్దవారికి మహమ్మారి సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
జీహెచ్ఎంసీలో పెరుగుతున్న కేసులు
ఇటీవల కాలంలో కరోనా బారిన పడుతున్న వారిలో సుమారు 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కేసులు మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక తాజాగా వెలుగు చూస్తున్న కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. జీహెచ్ ఎంసీ పరిధిలోనే కొత్తగా.. 138 మంది వైరస్ బారిన పడ్డారు. ఇక నగర పరిధిలోని అర్బన్ స్లమ్స్‌లోని వారికే మహమ్మారి సోకుతున్నట్లు అధికారులు తెలిపారు.
మొబైల్ కరోనా టెస్టులు
రంగారెడ్డి పరిధిలోని బాలాపూర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, లింగంపల్లిలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్కెట్లు సహా జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా మొబైల్ వాహనాల ద్వారా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అర్బన్ స్లమ్స్‌లో ఉండేవారిలో అత్యధికులు ఇతర ప్రాంతాల నుంచి పొట్టకూటికోసం నగరానికి వచ్చే వారని... అలాంటి వారికి పని ప్రదేశాల్లో మహమ్మారి సోకే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డితో పాటు.. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి , నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్‌లలో కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
రాష్ట్ర వ్యాప్తంగా మరో మారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ.. విడతల వారీగా జిల్లాల వైద్య అధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్ చర్యలు సహా.. ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తోంది. మరోవైపు కరోనా పెరుగుతున్న నేపథ్యంలో మందులు, పరీక్ష కిట్ల కొనుగోళ్లనూ ముమ్మరం చేసినట్టు సమాచారం.