Monkeypox News: దేశంలో మరో వైరస్ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం విదేశాల నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి 'మంకీపాక్స్' సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలపడంతో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను తక్షణం అమలు చేయనున్నట్టు ప్రకటించింది. మంకీపాక్స్ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది, వైద్యులకు మంకీపాక్స్‌కి సంబంధించిన లక్షణాలపై అవగాహన కల్పించటంతోపాటు... వివిధ రకాల నిర్ధరణ పరీక్షలు చేయడం, మంకీపాక్స్ కేసులను గుర్తించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపింది. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న, నిర్ధరణ అయిన బాధితులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కేంద్రం సూచించినట్లు పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇక దేశవ్యాప్తంగా వచ్చే మంకీపాక్స్ లక్షణాలున్న బాధితుల శాంపిళ్లను పరీక్షించేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి సహా మొత్తం 15 వైరాలజీ ల్యాబ్‌లకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
మంకీపాక్స్ గురించి:మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంటుంది. ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.