ఆరు దశాబ్దాల పోరాటం, ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ (Telangana) ఏడు వసంతాలను పూర్తి చేసుకుంది. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైన నవ తెలంగాణ రాష్ట్రం (Telangana state) బంగారు తెలంగాణ దిశగా పయనిస్తూ ఎనిమిదో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఏడేళ్ల తెరాస (Trs) పాలన విజయాలు, విశేషాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
సంక్షేమ కార్యక్రమాలు...
తెలంగాణలో ఆకలిచావులు ఉండకూడదని, కనీస జీవనభద్రత కల్పించాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) సంకల్పానికి అనుగుణంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో అమలు చేయని విధంగా ప్రతి ఏటా రూ. 45 వేల కోట్లతో వివిధ రకాల ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, మహిళలు, శిశుసంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది.
దీంతో పేదలకు కనీస జీవనభద్రత ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సాధించింది. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు అమలు చేస్తోంది. రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ (Cm kcr) స్వల్ప, మధ్య, ధీర్ఘకాలిక లక్ష్యాలతో అమలు చేస్తున్న వ్యూహాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నారు. పంట కోసం దుక్కి మొదలు పంట అమ్ముకునే దశ వరకు రైతులకు సర్కార్ పూర్తి అండగా ఉంటోంది.
వ్యవసాయం అనుబంధ రంగాలు...
వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, రైతుబీమా సహా ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలో సాగువిస్తీర్ణం, పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గొర్రెలు, చేపల పెంపకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. కోటి పాతిక లక్షల ఎకరాల మాగాణి లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సాగునీటి రంగం (Irrigation)పై రూ. లక్షా 59 వేల కోట్లు ఖర్చు చేసింది. కొత్తగా 20 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టుతో పాటు మరో 31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 72.5 లక్షల ఎకరాలను సాగునీరు అందుతుండగా రానున్న రెండు, మూడేళ్లలో మిగిలిన 52.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి కలుగుతుందని తెలిపింది. ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.
విద్యుత్ రంగంలో...
విద్యుత్ (Current) విజయాన్ని తెలంగాణ రాష్ట్ర విజయాల్లో గొప్పగా చెప్పుకోవచ్చు. సంక్షోభం నుంచి గట్టెక్కి కోతలు లేని విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం. 13 వేల మెగావాట్లకు పైగా డిమాండ్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేసే పరిస్థితి ఏర్పడింది. మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.
పారిశ్రామికంగా...
పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ (TSIPASS) చట్టం అద్భుత ఫలితాలు ఇస్తోంది. సులభతర అనుమతులతో దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్‌కు, తెలంగాణకు పరుగులు పెట్టడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడింది. ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా 14 రంగాలను ప్రాధాన్యంగా ఎంచుకొని పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.