Tamilisai at Mahila Darbar : మహిళలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేని అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆడవాళ్లను ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడు బలమైన శక్తిగా ఉంటానని తెలిపారు. తెలంగాణ మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బాధితుల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తానన్న తమిళిసై.. మహిళ బాధపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు.
Mahila Darbar At Raj Bhavan : రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్న కార్యక్రమాలతో ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న తమిళిసై ఇవాళ మహిళల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఓ అడుగు ముందుకేశారు. వారి సమస్యలు చెప్పుకోవడానికి మహిళా దర్బార్ పేరుతో రాజ్ భవన్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆడవారు బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న అంశాలపై చర్చించారు.
'గవర్నర్ ప్రజలను కలుస్తారా అని చాలా మందికి అనుమానాలున్నాయి. కానీ.. ప్రభుత్వ కార్యాలయమైన రాజ్‌భవన్ ఉంది ప్రజల కోసమే. వారి సమస్యలు వినడానికే. వాటిని పరిష్కరించడానికే. కరోనా సమయంలోనూ నేను రోగులను పరామర్శించాను. నా వంతు సాయం చేశాను. సమాజంలో మహిళలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారు. ఇంట్లో, పనిచేసే చోట, పాఠశాలల్లో, కాలేజీల్లో, రోడ్లపైన ఇలా ప్రతిచోటా ఆడపిల్లలు వేధింపులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది వాటి గురించి ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక.. వేధింపులు తట్టుకోలేక వారిలో వారే కుమిలిపోతున్నారు. కొన్నిసార్లు భరించలేని మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదంతా ఆపడానికీ.. తెలంగాణ మహిళలకు నేనున్నానని చెప్పడానికే ఈ మహిళా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశాను.' -- తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్